● దీపావళికి వచ్చి విగత జీవిగా మారిన యువకుడు
గజపతినగరం: మండల కేంద్రంలోని పురిటి పెంట ఎల్సీ గేట్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతూ ఓ యువకుడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ పంఘటన వివరాలిలా ఉన్నాయి. చైన్నెలోని సత్యభామ ఇంజినీరింగ్ కాలేజ్ చదువుతూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ శిక్షణ తీసుకుంటున్న పురిటిపెంట గ్రామానికి చెందిన శీరంరెడ్డి పవన్‌కల్యాణ్(23) దీపావళి పండగకు సొంత గ్రామానికి 6వ తేదీన వచ్చాడు. మంగళవారం ఉదయం బహిర్భూమికని పురిటి పెంట ఎల్సీ గేట్ సమీపంలోకి వెళ్లేందుకు చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా కోర్బా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని రైల్వై హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. తక్షణమే క్షతగాత్రుడిని 108వాహనంలో గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లి రామకృష్ణమ్మ, తండ్రి సత్యం తల్లడిల్లో పోయి కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్నారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి..
కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి–కొత్తవలస రైల్వేస్టేషన్‌ల మధ్య రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ మురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంటకాపల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో పట్టాల పక్కన మృతదేహం పడి ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ట్రైన్ నుంచి జారి పడి ఉన్నట్లు అనవాళ్లు కనిపించినట్లు రైల్వే హెచ్‌సీ తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. నీలం రంగు జీన్ ఫ్యాంట్, తెల్లని పూల డిజైన్‌గల ముదురు నీలం రంగు ఫుల్‌హ్యాండ్స్ షర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని విజయనగరం రైల్వే అస్పత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలకు ఫోన్ 8639193751 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
గడ్డి మందు తాగిన వ్యక్తి..
రామభద్రపురం: మండంలోని కొట్టక్కి గ్రామంలో గడ్డి మందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొల్లి సింహాచలం(42) మద్యం తాగేందుకు అలవాటు పడ్డాడు. అయితే మద్యం తాగిన తర్వాత మతిస్థిమితం కోల్పోతుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 8న పురుగు మందు డబ్బాలో గడ్డి మందు వేసుకుని తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెచ్‌సీ కె నరసింహమూర్తి కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
26 దేశాల్లో వాసవి క్లబ్ సేవలు
విజయనగరం కల్చరల్(క్రైమ్): సమాజ సేవకు అంకితమైన ఏకై క సంస్థ వాసవి క్లబ్ అని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు శిద్ధా సూర్యప్రకాశరావు అన్నారు. ఈ మేరకు స్థానిక ఒక ప్రైవేట్ కల్యాణ మంటపంలో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యప్రకాశరావు మాట్లాడుతూ .ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో లక్షలాదిమంది సభ్యులతో వాసవి క్లబ్ విస్తరించిందని సేవలు అందిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1750 క్లబ్బులతో సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటడం, ప్రజలకు శుద్ధజల పంపిణీ చేపట్టడం.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే తక్షణ సహాయంగా రూ.25వేలు, ఆడపిల్లల వివాహ నిమిత్తం రూ.25వేలు సహాయం అందజేయడం. విద్యార్థులకు ఆసరాగా ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. నూతనంగా దేవాలయాలు నిర్మించే వారికి ఒక లక్ష రూపాయలు అందిస్తున్నామని, పలు పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల కోసం వాసవి భవనాల ద్వారా ఉచిత వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ తమ్మన కల్యాణరాజు, పూర్వ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఏవీఎస్ ఎన్. గుప్త, ఇంటర్నేషనల్ సెక్రటరీ దర్శి శ్రీనివాస గుప్తా, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న క్లబ్బులకు జ్ఞాపికలు అందజేశారు.


