● యూనిఫారానికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన కలెక్టర్
సాక్షి, పార్వతీపురం మన్యం: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్యమైన ప్రతిపాదనను సమర్పించారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతమున్న సంప్రదాయ యూనిఫాంల స్థానంలో సౌకర్యవంతమైన స్పోర్ట్స్ తరహా యూనిఫాం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన దర్జీల కొరత వల్ల ప్రస్తుత యూనిఫాంల కుట్టు నాణ్యత సరిగా ఉండడం లేదని, త్వరగా చిరిగిపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల లోగోతో కూడిన గాలి పీల్చే కాటన్ ఫ్యాబ్రిక్ టీ–షర్ట్, ట్రాక్ ప్యాంట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కదిలేందుకు మెరుగైన సౌకర్యం లభించడమే కాక.. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ఈ ప్రతిపాదనను పైలట్ ప్రాజెక్ట్‌గా ముందస్తుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి అనుమతించాలని కోరారు.
● కలెక్టర్ల కాన్ఫరెన్‌న్స్‌లో పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. మన్యం జిల్లాలోని విద్యాశాఖ బడ్జెట్ సమన్వయంతో బాలురు, బాలికలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఇప్పటికే ఎంపిక చేశామని, రాబోయే రెండు వారాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒలింపిక్ క్రీడలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.
● యువత నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన ‘నైపుణ్యం’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జిల్లా ఏకంగా 65.8 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
● జిల్లాలో ఈ–ఆఫీస్ ఫైళ్ల సమర్థ నిర్వహణపై సీఎం ప్రశంసించారు. కలెక్టర్‌కు వచ్చే ప్రతి ఫైల్‌ను సగటున కేవలం 5 గంటల వ్యవధిలోనే పరిష్కరించి క్లియర్ చేస్తున్న తీరుపై అభినందనలు తెలిపారు. ప్రజలకు, అర్జీదారులకు వేగంగా న్యాయం జరిగేలా మన్యం జిల్లా చూపిస్తున్న ఈ పనితీరును అందరూ స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలని సూచించారు.
● జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. కేవలం భౌతిక వసతులు, కిట్ల పంపిణీతోనే సరిపెట్టకుండా విద్యార్థులకు అందే విద్యా ప్రమాణాలను పెంచడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
● జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రైతులకు నిలకడైన ఆర్థిక పరిపుష్టి అందించేందుకు చేపడుతున్న ఉద్యాన అభివృద్ధి చర్యలను కలెక్టర్ వివరించారు. పైనాపిల్, జీడిమామిడి, పసుపు పంటల ప్రగతిని తెలియజేశారు.


