విశాఖపట్నం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని మారికవలసలో జరిగిన ఈ సంఘటనపై పీఎంపాలెం ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్ అవెన్యూలోని 202వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం చైతన్య తండ్రి రవికుమార్ మృతి చెందాడు. అప్పటి నుంచి చైతన్య మానసికంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనికి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న మనస్పర్థలు కూడా తోడయ్యాయని, ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. శుక్రవారం తెల్ల వారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య పక్కన లేకపోవడంతో మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య తువ్వాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు ఎస్.కోట వాసి


