పార్వతీపురం రూరల్: కళాశాల విద్యార్థుల మధ్య రేగిన పాతకక్షలు రచ్చకెక్కగా, ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని ఒక అమాయక వంట మనిషి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీ సమీప ప్రధాన రహదారిపై కలకలం రేపింది. స్థానిక కల్యాణ మంటపంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల వేడుకల అనంతరం, కేటరింగ్ సామగ్రితో ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న వంట మనిషిని, మరో విద్యార్థిని కొందరు యువకులు మార్గమధ్యంలో అడ్డగించారు. సదరు విద్యార్థితో పాత విషయాలపై వాగ్వాదానికి దిగి భౌతిక దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న వంట మనిషి గమనించి, వారిని వారించేందుకు జోక్యం చేసుకోగా.. ఉన్మాదంతో రగిలిపోయిన ఆకతాయిలు వంటమనిషిపై కూడా విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న సిమెంట్ రేకుల ముక్కలు, పిడికిళ్లతో దారుణంగా కొట్టడంతో ఆ వంట మనిషి తల, పెదవికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడిని గమనించిన ఓ స్థానిక ఆటో డ్రైవర్ తక్షణమే స్పందించి పార్వతీపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన విద్యార్థులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.


