ఒకరు మునిగిపోయి.. మరి కొందరిని ముంచారు.. | - | Sakshi
Sakshi News home page

ఒకరు మునిగిపోయి.. మరి కొందరిని ముంచారు..

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ట్రేడింగ్‌ పేరుతో కుచ్చుటోపీ

ట్రేడింగ్‌తో టోకరా..

క్యూవీఎస్‌ఈ యాప్‌ ఎంతగా విస్తరించిందంటే ఏకంగా వాట్సాప్‌ గ్రూపులు మెయింటైన్‌ చేసేంత వరకు వెళ్లింది. ప్రతి పట్టణంలో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఆ ఊరిలో డబ్బులు డిపాజిట్‌ చేసిన వారిని సభ్యులుగా చేర్పిస్తారు. ప్రతి రోజూ యాప్‌కు సంబంధించిన కోడ్‌ లు ఇందులో పోస్ట్‌ చేస్తారు.ఈ కోడ్‌ తోనే ట్రేడింగ్‌ చేయాలి అని చెబుతారు. వారందరూ దాదాపుగా డబ్బు డిపాజిట్‌ చేసిన వారే. ఇప్పుడు గ్రూప్‌ సభ్యులు అందరూ లబోదిబోమంటున్నారు. మోసపోయాం అంటూ బాధపడుతున్నారు..

గజపతినగరం రూరల్‌ / రాజాం సిటీ:

న్‌లైన్‌లో జరుగుతున్న మోసాలు ప్రతిరోజూ వింటున్నా.. చూస్తున్నా.. మోసపోతూనే ఉన్నారు. ఒకవైపు పోలీసులు ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా ఈ మోసాలు ఆగడం లేదు. తాజాగా గజపతినగరం, రాజాం నియోజకవర్గాల పరిధిలో క్యూవీఎస్‌ఈ డాలర్‌ స్కామ్‌ బహిర్గతమైంది. క్యూవీఎస్‌ఈ డాలర్ల స్కామ్‌లో వేలాది మంది కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆన్‌లైన్‌ మోసం జిల్లా వాసుల్లో కలకలం రేపుతోంది. మధ్య తరగతి ప్రజలు, రాజకీయ నాయకులు, చిన్న ఉద్యోగులు, మహిళలు సైతం లక్షల రూపాయలు పెట్టి మోసపోయినట్లు సమాచారం. పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తున్నాయన్న ఆశతో డిపాజిట్‌ చేసి అడ్డంగా బుక్‌ అయిపోయారు. జిల్లాలో సుమారు రెండువేల మంది పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.

రూ.50 వేలు మొదట కట్టి సభ్యుడినిగా చేరిన మూడు నెలల్లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయనే ఆశతో వందలాది మంది ఈ యాప్‌లో చేరి డబ్బులు డిపాజిట్‌ చేశారు. కుటుంబాలకు కుటుంబాలు ఈ యాప్‌లో డబ్బు డిపాజిట్‌ చేసేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో పాటు మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఒక గ్రూప్‌గా మారిపోయి ఒకరి తర్వాత ఒకరు డబ్బులు డిపాజిట్‌ చేశారు. మహిళలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మరీ క్యూవీఎస్‌ఈ యాప్‌లో డిపాజిట్‌ చేసి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మొదట జాయిన్‌ అయినవారు చైన్‌ సిస్టంలో ఒక్కొక్కరు ఐదుగురు చొప్పున రిఫర్‌ చేసి జాయిన్‌ చేస్తే బోనస్‌ ఇస్తామని యాప్‌ నిర్వాహకులు ప్రకటించడంతో చాలా మంది తాము మోసపోవడమే కాదు తమ బంధువులు, స్నేహితులను కూడా ఈ మోసంలో బాధితులను చేశారు. ఒక్కొక్కరు ఐదుగురిని జాయిన్‌ చేసి వారితో కూడా డబ్బులు డిపాజిట్‌ చేయించారు. తాము చేర్చినందుకుగాను వచ్చిన బోనస్‌ ఒక్కక్కరివి లక్షలాది రూపాయలు యాప్‌లో ఉండిపోయాయి. ఒక్కొక్కరు రెండేసి మూడేసి ఐడీలతో డబ్బును విచ్చలవిడిగా డిపాజిట్‌ చేసేశారు. ఆగస్టు 24 తేదీ నుంచి విత్‌ డ్రా ఆప్షన్‌ తీసివేయడంతో లబోదిబోమంటున్నారు.

విత్‌డ్రాలు నిలిచిపోవడంతో బహిర్గతం..

గత 15 రోజులుగా విత్‌ డ్రాలు నిలిచిపోవడంతో సంస్థ ఏర్పాటు చేసిన మూడు రకాల వాట్సాప్‌ గ్రూపుల ద్వారా లావాదేవీలు జరిపిన పెట్టుబడిదారులు లబోదిబోమనడంతో మోసం బహిర్గతమైంది. కష్టపడి దాచుకున్న డబ్బంతా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రేడింగ్‌ నిబంధనల ప్రకారం కొంతమంది ఖాతాల్లో లక్షల రూపాయలు లాభాలు చూపిస్తున్నా ఆ డబ్బులు విత్‌ డ్రా కావడం లేదు. విత్‌ డ్రా కావాలంటే అదనంగా మరో రూ.50వేలు డిపాజిట్‌ చేస్తే మీ లాభాలు చెల్లింపు చేస్తామంటూ మెసేజ్‌లు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. బోనస్‌ చెల్లింపులు కోసం ఈనెల 12వ తేదీ వరకు యాప్‌ నిర్వాహకులు గడువు ఇచ్చినట్లు, ఆ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఒకరు మునిగిపోయి మోసపోయిన స్కామ్‌ కాదు. యాప్‌లో మొదట్లో డబ్బు రావడంతో ఇది మోసం అని తెలియక చాలా మంది మరికొంతమందిని ఇందులో జాయిన్‌ చేశాారు. యాప్‌లో వచ్చే రిటర్న్స్‌ బాగుండడంతో బయట తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి యాప్‌ లో డిపాజిట్‌ చేసిన వారు కూడా ఉన్నారు. బ్యాంకులో నగలు పెట్టి డబ్బులు తెచ్చిన వారు కూడా ఉన్నారు. మహిళలు కొందరు తమకు వచ్చిన బ్యాంకు రుణం సొమ్మును ఇందులో డిపాజిట్‌ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ఒకరేంటి చాలా మంది ఎలాగోలా డబ్బు పుట్టించి యాప్‌ నిర్వాహకుడికి అప్పనంగా ఇచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement