విజయనగరం ఫోర్ట్: రెడ్‌క్రాస్ సొసైటీలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 22న రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సత్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సూపర్ వైజర్ (బీఎస్సీ ఎంఎల్‌టీ), డీఎంఎల్‌టీగా ఏడాది అనుభవం ఉన్నవారు, ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్‌టీ విద్యార్హత) ఏడాది అనుభవం, స్టాఫ్‌నర్సుకు జీఎన్‌ఎంగా ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు.
సహస్ర ఘటాభిషేకం
శృంగవరపుకోట: మండలంలోని పుణ్యగిరి శివాలయంలో దేవదాయ దర్మదాయశాఖ ఆదేశాల మేరకు గురువారం దృశ్య వరుణ పూజ సహస్ర ఘటాభిషేకంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పురోహితుడు లట్టాన మణిశర్మ ఆధ్వర్యంలోని వేదపండితులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
విమానాశ్రయ భూముల పరిశీలన
బాడంగి: బాడంగి సమీపంలోని విమానాశ్రయ భూములను విశాఖ ఏన్‌డీఏకు చెందిన అధికారులు బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు, తహసీల్దార్ వరప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్‌డీఏకు చెందిన డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు విమానాశ్రయ గచ్చు రోడ్డును నిశితంగా పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన రన్‌వేతో కలిపి సుమారు 247 ఎకరాల భూములకు కేవలం రన్‌వేగచ్చు రోడ్డు 50 ఎకరాలు మినహా మిగిలిన 197ఎకరాలు రైతుల ఆక్రమణలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. ఆక్రమిత భూముల్లో ప్రస్తుతం నీలగిరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతుండడాన్ని గమనించారు. భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని రెవెన్యూ ఽఅధికారులను కోరారు. విమానాశ్రయ భూములను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
ఖైదీల పట్ల వివక్ష చూపొద్దు
విజయనగరం లీగల్: ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. విజయనగరం సబ్ జైలులో గురు వారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె మాట్లాడారు. ప్రతిఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని హితవు పలికారు. సకాలంలో న్యాయ సహాయం అందించేందుకు జైల్ లీగల్ ఎయిడ్ క్లినిన్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, భోజనశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, తదితరులు పాల్గొన్నారు.


