● బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాన్ని
నిలిపివేసిన నిర్వాహకుడు
విజయనగరం ఫోర్ట్:
వన్‌స్టాప్ సెంటర్ అందించే సేవలను ప్రచా రం చేయడానికి, రెస్క్యూ కార్యక్రమాల కోసం ఏర్పాటుచేసిన ప్రచార రథానికి బ్రేకులు పడ్డాయి. ఐసీడీఎస్ అధికారులు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల ప్రచార రథానికి బ్రేకులు పడ్డాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రచారరథం సేవలు ఇలా..
కళాశాలలకు, పాఠశాలలకు, సచివాలయాలు, వసతి గృహాలకు వాహనంపై సిబ్బంది వెళ్లి వన్‌స్టాప్ సెంటర్ మహిళలకు అందించే రక్షణ, ఉచిత న్యాయ, వైద్యసేవలు, బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ మోసాలు, గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఆపదలో ఉన్న మహిళలను వన్‌స్టాప్ సెంటర్‌కు తీసుకు రావడానికి, బాధితులను ఇంటికి చేర్చడానికి వాహనాన్ని వినియోగించే వారు. జిల్లాలో వన్‌స్టాప్ సెంటర్ ప్రచార రథాన్ని గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 200 వరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. 15 రెస్క్యూలు నిర్వహించారు. డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు మాత్రమే వాహనానికి బిల్లులు చెల్లించారు. నెలకు రూ.37,500 చొప్పున అద్దె చెల్లించేలా ప్రచార రథాన్ని సమకూర్చారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలఖారు వరకు ఐదు నెలలకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో రథం నిర్వాహకుడు వాహనాన్ని నిలిపివేసినట్టు సమాచారం. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందికి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ (పీడీ)కి మధ్య గత కొన్ని నెలలుగా కోల్డ్‌వార్ నడుస్తుండడం వల్లే వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది ఏది అడిగినా పీడీ వాటిని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వివరణ అడిగేందుకు పీడీ బాలామణికి ఫోన్‌చేయగా ఆమె స్పందించ లేదు.


