● సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం ● గ్రామస్తుల తీవ్ర ఉత్కంఠ
పార్వతీపురం రూరల్: గజరాజుల గమనం, కుంకీల కదనం మధ్య పార్వతీపురం, కొమరాడ మండలాల సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంటలు పాడుచేస్తూ, గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న అడవి ఏనుగుల గుంపునకు అడ్డుకట్ట వేసేందుకు కుంకీ ఏనుగులు అహర్నిశలు పహారా కాస్తున్నాయి. ఇటీవల ఆంధ్రా–ఒడిశా సరిహద్దులకు వెళ్లిన అడవి ఏనుగులు, అక్కడి ప్రజల తరిమివేతతో వెనుదిరిగి వచ్చి ప్రస్తుతం గంగమాంబపురం, చందలింగి, వరహాల గడ్డ రిజర్వాయర్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఈ మదపుటేనుగులు పెద్దమరికి పంచాయతీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కుంకీ ఏనుగులైన ’అభిమన్యు, జయంత్’లు కంచెలా నిలబడి సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి. బుధవారం రాత్రి ఈ రెండు గుంపులు ముఖాముఖి ఎదురుపడగా, గురువారం నాటికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మకాం వేశాయి. శిక్షకుడు సాయి, మావటీల పర్యవేక్షణలో కుంకీ ఏనుగులకు తగిన ఆహారం, నీరు అందిస్తూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పగటి పూట గిరిజన గ్రామాల్లో, మెట్ట ప్రాంతాల్లో కుంకీలు సంచరిస్తుండడంతో తమ ప్రాణ, ఆస్తులకు రక్షణ లభించిందని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాత్రివేళ ఈ రెండు గుంపులు మరింత చేరువవుతున్న తరుణంలో అటవీశాఖ అధికారులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించనున్నారు? గజరాజుల మళ్లింపు సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంటిమీద కునుకులేకుండా జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


