బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద కొత్తగా నిర్మించిన వంతెన సమీపంలో అదే గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోష్(37) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రివరకు బ్రిడ్జికి ఆవల వైపు ఉన్న పొలాల వద్ద స్నేహితులతో మద్యం తాగిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో బ్రిడ్జి పైన ఉన్న రహదారిపైకి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సంతోష్ మృతి చెంది ఉంటాడని తెలిపారు. శరీరంపై ఎక్కడా గాయాలు కాలేదని, కేవలం తల, నుదురు భాగంలో మాత్రమే తీవ్రమైన గాయముందని, వాహనం ఢీకొట్టగానే రోడ్డుపైనుంచి కిందికి పడిపోయి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. డీఎస్పీ ఆర్ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ టీంతో విచారణ చేపట్టారు. ఎటువంటి క్లూస్ లభించ లేదని తేల్చారు. అయితే సంతోష్ మృతి పట్ల తండ్రి తిరుపతిరావు తన కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులుతో మాట్లాడుతూ అప్పలరాజు పేట రహదారిలో వాటర్ ప్లాంట్ వద్ద బుధవారం రాత్రి 8 మంది స్నేహితులతో కలిసి సంతోష్ మద్యం తాగాడని రాత్రి 11 గంటల వరకు సంతోష్‌కు ఫోన్ పనిచేసిందని, అనంతరం ఫోన్ పనిచేయలేదని, అలాగే మృతదేహం సమీపంలోను, సంఘటనా స్థలంలో సంతోష్ ఫోన్ కూడా లభ్యం కాలేదని దీంతో ఎవరైనా గిట్టనివారు, లేదా మద్యం మత్తులో హత్య చేశారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇచ్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడికి తల్లి సింహాచలం, తమ్ముడు సాయి ఉన్నారు. ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


