దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

అధికారుల తీరుపై ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం అసహనం

శ్మశానవాటికలకు తక్షణమే దారులు కల్పించాలి: ఎంఆర్‌ఓలకు ఆదేశం

పార్వతీపురం రూరల్‌: ప్రోటోకాల్‌ పాటించడంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఆయన ప్రత్యేక గ్రీవెన్స్‌, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న తమకు ఆర్డీఓ కార్యాలయం నుంచే ప్రోటోకాల్‌ అందాల్సి ఉండగా, ఆ బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేయడం దారుణమన్నారు. ‘ప్రోటోకాల్‌ పాటించకపోవడానికి మేమేమైనా వార్డు మెంబర్లమా? ఈ నిర్లక్ష్యపు తీరు పునరావృతమైతే అధికారులను కమిషన్‌ ముందు నిలబెడతాం. మీ కెరీర్‌కు మచ్చ తెచ్చుకోవద్దు‘ అని ఘాటుగా హెచ్చరించారు. అనంతరం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో దళితుల శ్మశానవాటికల ఆక్రమణలపై ఆయన స్పందించారు. ప్రాణం పోయాక కూడా దళితులకు ప్రశాంతత కరువయ్యేలా ఆక్రమణలు జరగడం శోచనీయమన్నారు. శ్మశానాలకు దారులు లేకపోతే, ప్రైవేటు భూములైనా సేకరించి (ల్యాండ్‌ అక్విజిషన్‌) మార్గం సుగమం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే రక్షణ గోడలు, కందకాలు నిర్మించాలన్నారు. దళిత భూసమస్యల పరిష్కారంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేసి న్యాయం చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ ఆదేశాల మేరకు జోగంపేట, గురుగుబిల్లి ఎస్సీ వసతిగృహాలను తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement