● గ్రామసభలో అధికారులకు తేల్చి చెప్పిన కొత్తవలస గ్రామస్తులు
రాజాం: రాజాం మున్సిపాలిటీలో రోజుకొక వివాదం తెరమీదకు వస్తోంది. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి ఎలాకై నా ఎన్నికలు జరిపించేందుకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన కొత్తవలస గ్రామస్తులు.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల కిందట తమకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. దీంతో కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి స్పందిస్తూ కొత్తవలస గ్రామంలో గ్రామసభ నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎంపీడీఓ ఆనందరావు, పట్టణ సీఐ నవీన్‌కుమార్, తదితరులు గ్రామంలో బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ వేదికకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు.
పంచాయతీగా ఉంటాం..
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ గ్రామం 2005కు ముందు ఏ మాదిరిగా పంచాయతీగా ఉందో అదేవిధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీగా ఉంటే తమకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్‌గా చేసుకుని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుంచి సక్రమంగా పారిశుధ్య పనులు కూడా చేపట్టడం లేదని వాపోయారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉంగటి శంకర్, తవిటినాయుడు, వాన అసిరినాయుడు, బట్న మురళీకృష్ణ, హరి, వాన అలివేలమ్మ, ఉంగటి సూరీడు, పసుపురెడ్డి సత్యవతి, నక్క గౌరి, వాన రమణమ్మ, తదితరులు మాట్లాడారు.
టీడీపీ నేతల కొత్త డ్రామా..
ఇదిలా ఉండగా గ్రామసభ జరుగుతుండగా ఈ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికారులను కలిశారు. గోపాలపురం, అమ్మవారికాలనీ, ఆదర్శనగర్, తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలోనే ఉంచాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఇంతపెద్ద ఎత్తున కొత్తవలసలో ప్రజలు మున్సిపాలిటీని వ్యతిరేకిస్తుంటే, ఆ గ్రామసభకు టీడీపీ నేతలు నేరుగా వచ్చి పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలోనే ఉంచాలనే వినతిపత్రం ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.


