పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..! | - | Sakshi
Sakshi News home page

పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..!

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..!

ఎన్నో మెలికలతో ప్రకటన విడుదల

అర్హులందరికీ పెన్షన్లు అనుమానమే

బడ్జెట్‌, వాయిదా పద్ధతిన మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వం

బలిజిపేట: పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్నాయి. దీంతో అర్హులైన ప్రతివారికీ పింఛన్‌ వస్తుందనే నమ్మకం లేదనే చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కూటమి ప్రభుత్వం పింఛన్ల మంజూరుకు ప్రకటన జారీ చేసిందే తప్ప.. లబ్ధిదారులపై ఎటువంటి ప్రేమలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేశారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌ కేటాయింపు, దశలవారీగా మంజూరు అంటూ కొన్ని మెలికలు పెట్టారు. దీంతో పెన్షన్ల మంజూరులో పారదర్శకత కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచే పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడు వారి నుంచి సెర్ఫ్‌కు, అక్కడ నుంచి ప్రభుత్వం వద్దకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేరుతాయి. ఎంపీడీఓను దాటిన తర్వాత సెర్ఫ్‌కు వెళ్లేటప్పుడు అంతా జంతర్‌,మంతర్‌ జరగవచ్చని.. ఈలెక్కన అర్హులకు మొండిచేయి మిగులుతుందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ని పింఛన్లు అని చెప్పి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన వాటిని పచ్చ నాయకులు సర్దుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్నో మెలికలు..

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ అయి ఉండాలనే నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ పరిస్థితి లేదు. దీంతో వారు ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు కనుక అలాంటి వారిని తప్పించే అవకాశం ఉంది. ఇక డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకోవాలంటే సాంఘిక సంక్షేమ శాఖ జారీచేసిన సర్టిఫికెట్‌ను పొందుపరచాల్సి ఉంది. అది ఇప్పుటికప్పుడు కష్టసాధ్యంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒంటరి మహిళలకు సంబంధించి వివాహితురాలైతే కోర్టు లేదా అదాలత్‌ నుంచి విడాకుల పత్రం.. అవివాహితురాలైతే తహసీల్దార్‌ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశాలే.

ఎలా దరఖాస్తు చేసేది..

సమయం తక్కువుగా ఉంది. సచివాలయాల్లో సిబ్బంది కూడా పెద్దగా లేరు. సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పైగా లేనిపోని నిబంధనలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దరఖాస్తు ఎలా చేసేది.

– దయానంద్‌, దరఖాస్తుదారు, పెదపెంకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement