రహదారులా.. నరకకూపాలా..? | - | Sakshi
Sakshi News home page

రహదారులా.. నరకకూపాలా..?

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

రహదారులా.. నరకకూపాలా..?

పాలకులకు పట్టదు.. అధికారులకు చేతకాదు..

● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గిరిజనం

కురుపాం: మండలంలోని రహదారులకు మోక్షమెప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లు తేలి గోతులమయంగా మారిన రహదారులతో గిరిజనులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారులు తప్పనిసరిగా ఉండాలి.కాని మండల పరిధిలోని చాలా గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం 104, 108 వాహనాలు కూడా రావడం లేదు. తమ గ్రామాలకు రహదారులు మంజూరు చేయాలని కలెక్టర్‌, ఐటీడీఏ పీఓలకు గతంలో వినతిపత్రాలు అందజేసినా, అదుగో.. ఇదుగో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పరిష్కార మార్గం చూపడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీలకంఠాపురం పంచాయతీలోని గంగన్నదొరవలస గ్రామ రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో పాటు వర్షం పడితే బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరడ గ్రామ రహదారి కోసం గ్రామస్తులు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసనలు తెలియజేసినా అధికారుల్లో గాని పాలకుల్లో గాని చలనం రాకపోవడం విశేషం. ఉదయపురం పంచాయతీలోని రెల్లిగూడ గ్రామస్తులు అధికారులు, నాయకులు స్పందించక పోవడంతో శ్రమదానంతో గ్రామానికి రోడ్డు వేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. అదే పంచాయతీలోని జాకరగూడ గ్రామానికి వెళ్లే రహదారి కూడా బురదమయంగా ఉండడంతో గతంలో నాట్లు వేసి గిరిజనులు నిరసన తెలిపారు. ఇన్ని రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో గాని పాలకుల్లో గాని స్పందన రాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేయకతప్పదని ఆయా గ్రామాల గిరిజనులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement