● క్రీడాకారులను అభినందించిన ఐజీ
గోపీనాథ్ జెట్టీ
విజయనగరం టౌన్: మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు వరకు నిర్వహించిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 విభాగాల నుంచి సుమారు 1900 మంది పోలీసు అధికారు లు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్ మొత్తం 338 పతకాలు ( 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు) సాధించి రాష్ట్రస్ధాయిలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఐజీ విజేతలను బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరం జిల్లా పోలీసులు 39 స్వర్ణాలు, 21 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 74 పతకాలు సాధించారని చెప్పా రు. విశాఖ సిబ్బంది 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు.. అనకాపల్లి జిల్లా సిబ్బంది 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలు.. శ్రీకాకుళం జిల్లా సిబ్బంది 18 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు.. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు 14 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా సిబ్బంది 12 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారన్నారు.


