విజయనగరం టౌన్: నేర నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, నేరస్తులపై చర్యలు, ప్రజా భద్రత, తదితర అంశాలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ విశాఖ పట్టణంలోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్‌రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాలు పాల్గొని.. జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎన్‌డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సోషల్ మీడియా క్రైమ్స్, పల్లెనిద్ర, డిజిటల్ అరెస్టులు, మెగా వెహికల్ చెకింగ్‌లు, వినాయక చవితి పండగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.


