● పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ
విజయనగరం టౌన్: నిందితులు శిక్షింపబడే విధంగా కేసుల దర్యాప్తులో సాక్షులను, సాక్ష్యాధారాలను సేకరించాలని, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే ముందు అప్పటివరకూ పూర్తి చేసిన కేసు దర్యాప్తును ఒకసారి పునః సమీక్షించుకోవాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేసుల దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన క్రైమ్ ప్రాపర్టీని సురక్షితంగా ఒక క్రమపద్ధతిలో భద్రపర్చుకోవాలని, విచారణ సమయంలో వాటిని తిరిగి న్యాయస్ధానంలో ప్రవేశపెట్టాలన్నారు. నిందితులకు విచారణ, అరెస్టు సమయంలో వారు తెలిపే వివరాలు సరైనవా? కావా? అన్నది ముందుగా అధికారులు నిర్ధారణ చేసుకోవాలన్నారు. నేరాలు, దొంగతనాలు జరిగేందుకు ఎక్కువగా అవకాశమున్న బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, ఏటీఎం కేంద్రాలు, సెల్ టవర్స్ వద్ద సీసీ కెమెరాలు పెట్టే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకతీతంగా గుర్తించి, వారిని ఎంఈఎం కోర్టులో బైండోవరు చేయాలని, మంచి ప్రవర్తనకు వారి నుంచి పూచీకత్తుగా బాండ్‌లను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ జరిగే విధంగా అధికారులు ప్రణాళికబద్దంగా పని చేయాలన్నారు. సమావేశంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పీఎస్ డీఎస్పీ పివివి.నరసింహారావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయసలహాదారు వై.పరశురాం, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


