● వైఎస్సార్‌సీపీ నాయకునిపై
ఓ వ్యక్తి దౌర్జన్యం
గజపతినగరం రూరల్ (జామి): ‘అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...అమ్మ తోడు...’ ఇది ఓ సినిమాలో ఓ ప్రముఖ కథనాయకుడు చెప్పిన డైలాగ్. ఇది అప్పట్లో బాగానే వర్కవుట్ అయ్యింది. సినిమా కూడా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా చూశాడో ఏమోగాని... ప్రస్తుతం ఓ వ్యక్తి వైఎస్సార్‌సీపీ నాయకుడిని ఇలాగే... బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...జామి మండలం భీమసింగి గ్రామంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పాండ్రంగి సంజీవిపై అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు దౌర్జన్యానికి దిగిన సంఘటన ఇది. దీనిపై పాండ్రంకి సంజీవి జామి పోలీసులకు సోమవారం ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే విషయమై సంజీవి స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు వెల్లడించారు. భీమసింగి గ్రామకంఠం సర్వే నంబరు 120లో సంజీవికి 19 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలానికి అడ్డంగా అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు సోమవారం ట్రాక్టర్ లోడ్ రాయి తీసుకువచ్చి వేయించాడు. దీంతో సంజీవికి తన స్థలంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన సంజీవిపై శంకరరావు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది.. అడ్డొస్తే నరికి చంపుతానని.. బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో గత్యంతరం లేక సంజీవి జామి పోలీసులను ఆశ్రయించాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వీర జనార్దన్ మంగళవారం తెలిపారు. దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


