కొత్తవలస: విశాఖపట్నానికి సరిహద్దుగా ఉన్న కొత్తవలస మండలంలో ప్రభుత్వ భూములకు కాళ్లొచ్చాయి. బడానేతల కబంద హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. చెరువు గర్భాలు జిరాయితీ భూములుగా మారుతున్నాయి. సబ్ డివిజన్‌ల పేరుతో ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేసి బడాబాబుల పేరున బదలాయిస్తున్న తీరు పల్లె ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయకట్టు రైతులను కలవరపెడుతోంది. భూముల కబ్జా తీరును ‘భూ మాయ’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆగమేఘాలపై స్పందించారు. సంబంధిత తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్‌చేశారు. విచారణ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అప్పటి ఇన్‌చార్జి డీఆర్వో మురళీని నియమించారు. ఇది జరిగి 9 నెలలు గడుస్తున్నా ఆ భూములు ఇప్పటికీ అదే వ్యక్తుల పేరున వెబ్‌ల్యాండ్‌లో చూపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచారణ ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌చేసి ప్రభుత్వ భూములను మాయ చేయడం వెనుక రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ రికార్డులు సరిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తవలస గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 165–1లో ఉన్న ప్రభుత్వ భూమిని 165–3గా సబ్ డివిజన్ చేసి 5 ఎకరాల భూమిని జిరాయితీ భూమిగా మార్చేసి తిరుతాంబ, కె.శైలజ తదితరుల పేరిట బదలాయించారు.
కొత్తవలస మండలం చిన్నిపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 95లో 14.07 ఎకరాల విస్తీరంలో కొత్తచెరువు విస్తరించి ఉంది. దీనిని సర్వేనంబర్ 95–2గా సబ్‌డివిజన్ చేసి చల్లా రవికుమార్ పేరిట 3.71 ఎకరాల చెరువుగర్భాన్ని జిరాయితీ భూమిగా బదలాయించారు.
9 నెలలు గడుస్తున్నా
అతీగతీలేని వైనం
వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీ భూములుగా దర్శనమిస్తున్న ప్రభుత్వ భూములు
రీ సర్వేలో సర్దుబాటుకు తెరవెనుక మంతనాలు
రెల్లి రెవెన్యూ పరిధిలో కొంత ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చేసి బడాబాబులకు కట్టబెట్టారు. చింతలపాలెం గ్రామ రెవెన్యూలో పలు సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూములను జిరాయితీగా సబ్‌డివిజన్ చేసి అధికార పార్టీ పెద్దలకు కట్టబెట్టినట్టు సమాచారం. చింతలపాలెం రెవెన్యూలో ఒక వ్యక్తి పేరున ఉన్న సర్వే నంబర్లు 52–4, 12, 13, 14, 15, 17, 18, 53–8, 12లో గల భూములను ఎటువంటి మ్యూటేషన్ ఫైల్ లేకుండా వేరొకరి పేరిట బదలాయించారు. ఆయా సర్వే నంబర్లలోని భూముల విస్తీర్ణం కంటే అదనంగా భూమిని సృష్టించి బదలాయించారు. ప్రస్తుతం ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల పేర్లుపైనే జిరాయితీ భూములుగా వెబ్‌ల్యాండ్‌లో దర్శనమివ్వడం గమనార్హం.
రీ సర్వేలో సర్దుబాటుకు ప్రయత్నాలు
ప్రస్తుతం కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో రీ సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేందుకు బడాబాబులు నిత్యం రెవెన్యూ అధికారులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. అక్రమంగా సంపాదించిన భూములను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. చెరువు గర్భాలు, ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు జరిగిపోతే ఎవరిది బాధ్యత అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భూ మాయపై విచారణ కొనసాగుతోందని ఇ.మురళి చెప్పడం గమనార్హం.


