● పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ఈకేవైసీ, వెబ్‌ల్యాండ్ ప్రక్రియ, రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులు, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, 22ఏ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఆరా తీశారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అక్టోబర్‌లో 81 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
విజయనగరం రూరల్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరగనున్న సర్వసభ్య సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడిందని జెడ్పీ సీఈఓ ఎ.లవరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలన్నారు.
చైనాలో డ్రాగన్ బోట్ పోటీలకు శివాంజనేయ
గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గేదెల శివాంజనేయ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. చైనాలోని హాంగ్‌జౌలో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు భారతీయ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 28న భారత బృందం చైనాకు బయలుదేరి అక్టోబర్ 4న తిరిగి రానుంది. ప్రస్తుతం శివాంజనేయ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇన్‌స్పైర్ మానక్‌లో విద్యార్థుల ప్రతిభ
విజయనగరం: ఇన్‌స్పైర్ మానక్‌లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినట్టు డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. 2023–24లో మలిచెర్ల జెడ్సీ హెచ్‌ఎస్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థిని అంబటి సాయి వైష్ణవి రూపొందించిన ‘రిమోట్ స్లీప్ మానిటరింగ్ అండ్ మెడికల్ అలారమ్ సిస్టం’ , 2024–25లో కొండవెలగాడ జెడ్సీ హెచ్‌ఎస్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎల్.లిడియో రూపొందించిన ‘లో కాస్ట్ విన్నోయింగ్ యూనిట్’ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంలో ఇన్‌స్పైర్ మానక్ దోహదపడుతుందని డీఈఓ పేర్కొన్నారు. విజేతలను, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు.
జిల్లాలో నేడు, రేపు ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన
● దళితుల భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో కీలక సమీక్ష
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీకమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్వతీపురంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శించి వసతులను పరిశీలిస్తారని, గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో తహసీల్దార్లతో జరిగే భేటీలో షెడ్యూల్డ్ కులాల దశాబ్దాల భూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, పరిష్కార మార్గాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారని శ్యామల తెలిపారు.


