పార్వతీపురం: కుష్టువ్యాధి గుర్తింపు కోసం జిల్లాలో సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో సర్వేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది బృందాలు ప్రతి ఇంటినీ సందర్శించి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వ్యాధి నిర్ధారణయితే ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) అందిరన్నారు. శరీరంపై స్పర్శ తెలియని మచ్చలుంటే సర్వే బృందాలకు తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణాధికారి ఎస్‌కే హఫీజ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పద్మావతి, ఎన్‌ఎంఓ రాజేష్‌కుమార్, ఆర్‌బీఎస్‌కె పీఓ టి. జగన్ మోహనరావు పాల్గొన్నారు.


