ఆధునిక నైపుణ్యాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక నైపుణ్యాలు తప్పనిసరి

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

డేటా ఐఈఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ తిరుమలేష్‌

విజయనగరం అర్బన్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) యుగంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డేటా ఐఈఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ తిరుమలేష్‌ కొణతాల సూచించారు. గాజులరేగలోని సీతం కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఇండక్షన్‌ ప్రొగ్రాంనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌, డిఫెన్స్‌, బిజినెస్‌, తదితర రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోందన్నారు. అన్ని విభాగాల విద్యార్థులు ఏఐపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అవకాశాలను సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. డేటా ఐఈఐ ఏఐ ఇంజినీర్‌ భీమేశ్వరరావు మాట్లాడుతూ.. రోబోటిక్స్‌, వ్యవసాయం, క్లౌడ్‌ టెక్నాలజీ, తదితర రంగాల్లో భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా డేటా, ఏఐ, ఆధునిక సాంకేతికతపై ప్రాక్టికల్‌ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కందివలసలో

పంటలు ధ్వంసం

కొమరాడ: మండలంలోని రైతులకు గజరాజల బాధలు వీడడం లేదు. ఎప్పుడు ఎవరి పొలంలో పడి పంటలు ధ్వంసం చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క గజరాజులు ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మండలంలోని కందివలసలో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు పామాయిల్‌, జొన్న, అరటి, తదితర పంటలను నాశనం చేశాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చినా అటవీ ఏనుగులను తరలించలేకపోయారని గిరిజన రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గజపతినగరం రూరల్‌: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో గల విశాఖ డెయిరీ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కురుపాం మండలం దండుసుర గ్రామానికి చెందిన ఆరిక ఇరమమ్మ (47) మతిస్థిమితం లేక 20 రోజుల కింట ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఇరుమమ్మను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించి బంధువులకు సమాచారం అందజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మేనల్లుడు కండ్రిక చాలెంజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో జైలుశిక్ష

శృంగవరపుకోట: చెక్‌బౌన్స్‌ కేసులో రైల్వే ఉద్యోగికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని స్థానిక కోర్టు న్యాయమూర్తి బి.కనకలక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు. నగదు చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. న్యాయవాది బి.త్రిమూర్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఉంటున్న రైల్వే ఉద్యోగి పోకల రమణ ఎస్‌.కోట పట్టణానికి చెందిన అనాల మోహనరావు వద్ద ఏడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను రమణ చెక్‌ ఇచ్చారు. అయితే ఈ చెక్‌ బ్యాంక్‌లో జమ చేయగా బౌన్స్‌ అయింది. దీంతో అనాల మోహనరావు కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ముద్దాయికి జైలుశిక్ష విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement