రెవెన్యూ సమస్యలే అధికం.. | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలే అధికం..

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ పరమైన సమస్యలే అధికంగా వస్తున్నాయి.. క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 226 వినతులు రాగా.. అందులో 113 వినతులు రెవెన్యూశాఖకు చెందినవి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే జేసీ సేతు మాధవన్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూ సమస్యలను కేవలం రికార్డుల ఆధారంగా కాకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫిర్యాదుదారుడితో మాట్లాడిన అనంతరం నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే 1100 టోల్‌ ఫ్రీ సేవల ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని జేసీ స్పష్టం చేశారు.

శాఖల వారీగా వచ్చిన వినతులు..

రెవెన్యూ – 113, పంచాయతీరాజ్‌ – 24, డీఆర్‌డీఏ – 34, విద్యుత్‌ – 9, గ్రామ సచివాలయాలు – 9, విద్యాశాఖ – 5, మున్సిపల్‌ –15, డీఎంహెచ్‌ఓ – 6, ఇతర శాఖలకు సంబంధించిన 15 వినతులు వచ్చాయి.

కుమారుడి జీతం బకాయిలు ఇప్పించండి..

విజయనగరం ఫోర్ట్‌: రామభద్రపురం మండలం ముప్పలపూడి గ్రామానికి చెందిన శీర రాఘవ వ్యవసాయశాఖలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి మృతి చెందాడు. దీంతో అతని జీతాల బకాయిలు తనకు చెల్లించాలని అతని తల్లి శీర అన్నపూర్ణ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది.

సమస్యల పరిష్కారానికే పీజీఆర్‌ఎస్‌..

పార్వతీపురం: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే పీజీఆర్‌ఎస్‌ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలితో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని.. పరిష్కారంలో అలసత్వం వహించరాదని ఆదేశించారు. ఈ సందర్భంగా మొత్తం 98 అర్జీలు అందగా.. అందులో 31 రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించినవి కాగా 67 వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలున్నాయి. పార్వతీపురం మండలం చలమవలస సమీపంలో ఏర్పాటు చేసిని పౌల్ట్రీఫారం తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గరుగుబిల్లి మండలం చినగుడబ గ్రామానికి చెందిన కె. తాతారావు తన భూమికి సంబంధించిన వన్‌ వీని మంజూరు చేయాలని కోరారు. పార్వతీపురం మండలం శివన్నదొరవలస గ్రామానికి చెందిన నిమ్మక సరస్వతి తన భర్త పేరున ఉన్న డీ పట్టా భూమిని తన పేరున నమోదు చేయాలని అర్జీ అందజేశారు. అలాగే పార్వతీపురం పట్టణానికి చెందిన గంగాధరరావు తనకున్న జిరాయితీ భూమిని 22 ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారులతో కిటకిటలాడిన

కలెక్టరేట్‌

226 వినతులు స్వీకరించిన

అధికారులు

సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు : జేసీ సేతు మాధవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement