విజయనగరం రూరల్: ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న అబ్కారీ శాఖకు జిల్లాలో సొంత గూడు లేకుండా పోయింది. అద్దె భవనాలు, శిథిల భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఎకై ్సజ్ సూపరింటిండెంట్ కార్యాలయం, విజయనగరం ఎకై ్సజ్ 1, 2 స్టేషన్లు శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బాలాజీనగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతుండగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ప్రదీప్‌నగర్‌లో మరో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఎకై ్సజ్ సూపరింటిండెంట్ కార్యాలయం కలెక్టరేట్‌లోని పాత భవనంలో కొనసాగుతోంది. విజయనగరం పట్టణ, గ్రామీణ ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ స్టేషన్లు పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో పాడుబడిన భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు టాస్స్‌ఫోర్స్ కార్యాలయం అక్కడే ఉంది. అయితే విజయనగరం ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు టాస్స్‌ఫోర్స్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గోడలు బీటలు వారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేషన్ పైకప్పు, గోడలు నానిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన పెంకుల షెడ్డుల్లోనే నేటికీ స్టేషన్లు నిర్వహించడం, అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే గ్రామీణ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కార్యాలయం పిచ్చుక గూడులాంటి చిన్నపాటి షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు, సిబ్బందికి మించి ఆ షెడ్డులో కూర్చునే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా కొన్నేళ్ల కిందట ఎకై ్సజ్ అధికారులు సొంత నిధులతో భవనం పైకప్పునకు మరమ్మతులు చేపట్టారు. కొత్త భవనాల నిర్మాణాలకు 2012లో నిధులు మంజూరైనా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయి. ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్న గూడ్సు షెడ్ ప్రాంతంలో ఆ శాఖకు సుమారు రెండెకరాల విశాలమైన సొంత స్థలం ఉంది. భవనాల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ స్థలంలో తుప్పలు, మొక్కలు ఏపుగా పెరిగి పాములకు ఆవాసాలుగా మారిపోయాయి. దీంతో అప్పుడప్పుడు విషసర్పాలు కార్యాలయంలోకి చొరబడి ఎకై ్సజ్ సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎకై ్సజ్ శాఖ నుంచి అధిక ఆదాయాన్ని పొందే ప్రభుత్వం ఆ శాఖ కార్యాలయాలకే భవనాలు నిర్మించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి సొంత భవనాలకు శ్రీకారం చుట్టాలని పలువురు కోరుతున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న
ఆందోళనలో సిబ్బంది
అబ్కారీ శాఖకు భవనాల కొరత
అద్దె భవనాల్లోనే డీసీ, ఏసీ
కార్యాలయాలు


