విజయనగరం టౌన్: బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించి 30 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా భూ తగాదాలకు సంబంధించినవి 22 అర్జీలు వచ్చాయి. కుటుంబ కలహాలకు సంబంధించి మూడు, మోసాలకు సంబంధించి రెండు, ఇతర అంశాలకు సంబంధించి మూడు ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏడు పనిదినాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తీసుకున్న చర్యలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సత్వర న్యాయం అందించాలి.. : ఎస్పీ మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు.. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, వేధింపులు, మోసాలకు సంబంధించిన సమస్యలపై ఎస్పీకి నేరుగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ.. సమస్య పూర్వాపరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతూ.. గడువు లోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 12 వినతులు అందాయి. డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సైలు అశోక్ చక్రవర్తి, శిరీషలతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


