● 31 పతకాలు సాధించిన పోలీసులు
పార్వతీపురం రూరల్: రక్షణ బాధ్యతల్లోనే కాదు.. క్రీడా మైదానంలోనూ సత్తా చాటారు మన్యం జిల్లా పోలీసులు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియనన్‌లో జరిగిన శ్రీతొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026శ్రీలో విశాఖ రేంజ్ తరఫున బరిలోకి దిగిన పార్వతీపురం మన్యం జిల్లా సిబ్బంది పతకాల పంట పండించారు. కేవలం తొమ్మిది మంది ఏకంగా 31 పతకాలు (14 స్వర్ణ, 9 రజత, 8 కాంస్య) కొల్లగొట్టి క్రీడాస్ఫూర్తిని రగిలించారు. కానిస్టేబుల్ మధుబాల అత్యధికంగా పది పతకాలతో అదరగొట్టగా.. సురేష్ (8), అరుణ్ కుమార్ (4), త్రినాథ్ (3), నాగభూషణరావు (2) పతకాలు సాధించారు. మనోజ్, రామకృష్ణ, బాలకృష్ణ, శివకుమార్ సైతం వివిధ క్రీడల్లో పతకాలు కై వసం చేసుకున్నారు. నేర పరిశోధనలో మేటి అనిపించుకునే ట్రాకింగ్ జాగిలం శ్రీశాండీశ్రీ సైతం రాష్ట్రస్థాయి జాగిలాల పోటీల్లో మెరిసి కాంస్య ట్రోఫీని ముద్దాడడం విశేషం. క్రీడా విజేతలను ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి సోమవారం అభినందించి, పతకాలతో సత్కరించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలే దివ్య ఔషధమని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ సిబ్బంది రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ థామస్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


