ఈ నెల కోటాలో గోధుమ పిండికి కోత
అరకొరగా రాగుల పంపిణీ
రేషన్ డీలర్లకు క్యూఆర్ కోడ్ తంటాలు
కొత్త విధానంపై డీలర్లకు ఇవ్వని శిక్షణ
సాంకేతిక సమస్యలతో రేషన్ పంపిణీకి అవస్థలు
రామభద్రపురం:
కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవ స్థ అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పకడ్బందీగా సాగిన ఇంటి వద్దకే రేషన్ విధానానాన్ని రద్దు చేసి వాహనదారుల పొట్టకొట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు నిరుపేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకులలోనూ కోత విధించింది. జిల్లాలో రేషన్ 1254 దుకాణా లు ఉండగా వాటి పరిధిలో ఉన్న 5,70,980 కార్డులకు 9,02,06 మెట్రిక్ టన్నుల బియ్యం 11 ఎంఎల్‌ఎస్ గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు నెల నెలా ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ సరుకు లే ఆసరా. అయితే రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం పొందుతున్న సరుకులతో పాటు అదనంగా రాగులు, కందిపప్పు, గోధుమ పిండి పంణీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో ఇచ్చే సరుకుల్లోనే కోత విధిస్తోంది. కేవలం బియ్యం, పంచదారతో మాత్రమే సరిపెడుతున్నారు. కొద్ది నెలలు కంది పప్పు ఇచ్చి అదీ పూర్తిగా ఎత్తేశారు. అలాగే రాగులైతే ఈ కోటాలో కొంత మందికే పరిమితం కాగా పలు చౌక దుకాణాలకై తే స్టాకే రాకపోవడం శోచనీయం. గోధుమ పిండి విషయానికొస్తే గత నెల వరకు ఇచ్చి ఈ నెల కోటాలో పూర్తిగా కోత విధించారు. గత నెల గోధుమ పిండి పంపిణీ చేసి ఈ నెల ఎందుకు ఇవ్వలేదంటూ కార్డుదారులు నిలదీస్తుండడంతో సరుకులు పంపిణీ చేసే డీలర్లకు తలనొప్పిగా మారుతోంది. రాగులు కూడా గోదాంలో అరకొరగా స్టాకు ఉండడంతో ముందొచ్చిన డీలర్లకు ఇచ్చేశాం.వచ్చే నెల చూద్దామంటూ గోదాం ఇన్‌చార్జిల నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాపుల ద్వారా కందిపప్పు,వంట నూనె, గోధుమ పిండి పంపిణీ చేయాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు.
రేషన్ డీలర్లకు క్యూఆర్ కోడ్ తంటాలు..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో అక్రమా ల కట్టడికి కొత్తగా క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకా రం చుట్టింది. సంబంధిత ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి సంబంధిత అధికారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయా లి. ఆ తర్వాతనే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. రేషన్ డీలర్లు కూడా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం తీసుకోచ్చేటప్పుడు తమకు ఇస్తున్న బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే రేషన్ దుకాణానికి తెచ్చి కార్డుదారుల కు పంపిణీ చేయాలి. ఈ విధానంతో అటు స్టాకు పాయింట్లలో గానీ,రేషన్ షాపుల్లోగానీ బియ్యం సక్రమంగా కచ్చితమైన తూకం ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అయితే ఈ విధానంతో ప్రతి బస్తా(50 కిలోలు)ను రేషన్ షాపుల వద్ద దించే హమాలీలు క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసేందుకు గంటల సమయం పడుతోంది. బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతోంది.అలాగే రేషన్ డీలర్లు ప్రతి బస్తా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే గాని కార్డుదారులకు పంపిణీ సాధ్యం కాదు. ప్రతి నెలా 15వ తేదీలోపు నిత్యావసరాల సరుకులను పంపి ణీ చేయాల్సి ఉంది. కొత్త విధానంతో ఈ ప్రక్రి య ఆలస్యం అవుతోంది. ఈ విధానం తమకు ఇబ్బందిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ తొలుత డీలర్లకు శిక్షణ ఇచ్చి ఆపై కొత్త విధానం అమలుకు పూనుకుంటే మేలని, దీని వల్ల సాంకేతిక సమస్యలు తలనొప్పి తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా స్థానిక రేషన్ షాపుల డీలర్లు ఆందో ళనకు దిగారు. క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
ప్రభుత్వం మండలాల్లోని రేషన్‌కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీకి సరఫరా చేయలేదు.గత నెలలో అదనంగా ఉందని పంపిణీ చేశాం.గోధుమ పిండి పంపిణీ విషయంపై గోదాం ఇన్‌చార్జిలు, సీఎస్‌డీటీతో చర్చిస్తాను. అలాగే రేషన్ షాపుల్లో అక్రమాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం క్యూఆర్‌కోడ్ స్కానింగ్ చేసే కొత్త విధానం అమలు చేసింది. దీన్ని విధిగా అమలు చేయాల్సిందే.ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ డీలర్లు తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చినట్లు నా దృష్టికి రాలేదు.
–మురళీనాథ్, డీఎస్‌వో, రామభద్రపురం


