విజయనగరం టౌన్: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 50–55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి విజయనగరం రైల్వేస్టేషన్‌కి దగ్గరలో ఆదివారం మృతి చెందాడు. మృతుడి శరీరంపై తెలుపు, నీలం రంగు ఉన్న పుల్‌హ్యాండ్స్ షర్ట్, ఎరుపు,పసుపు, నీలం రంగు గల రగ్గు కప్పుకుని ఉన్నాడు. ఆచూకీ తెలిసి న వారు ఫోన్ 9247585742 నంబర్‌ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వీఎన్.మూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ విజయనగరం వర్సిటీ విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొండపై విశ్వవిద్యాలయం కొనసాగుతోంది. అయితే విశ్వవిద్యాలయం వెనుక భాగాన కొండ దిగువన గతంలో పశు కబేళా నిర్వహించేవారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అనంతరం అక్కడ పశు కబేళా మూసివేశారు. అయితే ఇప్పటీకీ పశుమాంస విక్రయదారులు కొంతమంది పశు కళేబరాలను, మాంసం వ్యర్థాలను అక్కడికి తరలించి పడేస్తున్నారు. దీంతో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ తరగతుల నిర్వహణ సమయంలో కుళ్లిన పశు వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కొండకు ఆనుకుని బొండపల్లి మండల పరిధిలోని రెడ్డిపేట, డోలపేట, జియ్యన్నవలస గ్రామాలు ఉన్నాయి. కుళ్లిన వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పశు మాంస వ్యర్థాలను తరలించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.


