పూసపాటిరేగ: చింతపల్లి తీరంలోని పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. ఆదివారం అదే గ్రామంలో పర్యటించిన ఆయన..అక్కడి వివాదాస్పద భూములను మత్స్యకారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన..చింతపల్లి తీరంలోని పర్యావరణాన్ని ధ్వంసం చేసేలా సీఆర్‌జెడ్‌లోని చెట్లను తొలగించి మత్స్యకారులకు హాని కలిగించేలా చేస్తుండడం దుర్మార్గమన్నారు. ఎన్నో ఏళ్లుగా సీఆర్‌జెడ్‌లోని శ్మశానాలు, దేవుని ఆలయాలను తొలగిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారుల బోట్లను ఒడ్డున ఉంచేందుకు ఏంకర్‌గా ఉన్న చెట్లను తొలగించారని గ్రామస్తులు మేడ అప్పయ్యమ్మ, మైలపల్లి పైడమ్మ, అమర పోలమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని మత్స్యకారుల వినియోగంలోని సీఆర్‌జెడ్ భూములను రక్షించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు బర్రి చినఅప్పన్న, గాంధీ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.


