పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో ఈనెల 9న నిర్వహించనున్న బీజేపీ భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా స్థల పరిశీలనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాడు రాజేష్‌వర్మ స్థానిక కొమ్మూరు అప్పుదొర కళా ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వేదిక సమాయత్తం, కార్యకర్తలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్ వసతులపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజేష్‌వర్మ మాట్లాడుతూ..భోగాపురం మండలంలో తొలిసారిగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంతటి భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. సభను జయప్రదం చేసేందుకు కార్యక్రమంలో స్థానిక నాయకుడు అడపా ప్రసాద్, విజయనగరం బీజేపీ జనరల్ సెక్రటరీ పతివాడ రాజేష్, భోగాపురం బీజేపీ మండల అధ్యక్షుడు దిక్కు అప్పలరాజు, యువమోర్చా అధ్యక్షుడు రాజాన రమణ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్ర సమీపంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామానికి చెందిన గంట మహేష్ (35) పార్వతీపురం నుంచి ద్విచక్ర వాహనంపై ఖడ్గవలస వైపు వెళ్తుండగా.. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎదురుగా ఎర్రగుడి వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న గరుగుబిల్లి ఎస్సై షేక్ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు చిన్నమేరంగి సీఐ తిరుపతిరావు ప్రత్యేక పర్యవేక్షణలో ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆయా బృందాలు సంఘటన జరిగిన మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నాయని చెప్పారు.
ట్రాక్టర్ ఢీ కొని మహిళ..
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పూతికపేట గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనపై ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఒడ్డు నరసమ్మ (41) తన కుమారుడు బన్నీ, మేనళ్లుడు రాకేష్‌తో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై జరజాపుపేటలో ఉన్న తన అక్క ఇంటికి వస్తుండగా.. పూతికపేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరసమ్మకు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. నరసమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


