చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఒకవైపు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత.. మరోవైపు ప్రాణాల కోసం పోరాటం.. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి అక్షరాలా కోటి రూపాయలు ఉంటేగాని ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన గదల ఈశ్వరరావు కొంతకాలంగా సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతూ చీపురుపల్లిలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించారు. దీంతో అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, తక్షణమే ఊపిరితిత్తులు మార్చాలని ఇందుకు సుమారుగా 90 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఈశ్వరరావు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాడు. భార్యా, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఈ కుటుంబానికి ఇంత భారీ మొత్తంలో వైద్య ఖర్చును భరించే ఆర్థికస్థోమత లేదు. దీంతో దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. సాయం చేయాల్సిన దాతలు 96400 18559 నంబర్‌ను సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న
ఈశ్వరరావు
ఆపన్నహస్తం కోసం
ఎదురుచూపులు


