● డబ్బులు ఇవ్వలేదని యువకుడి చేతులు కట్టి బైక్‌తో ఈడ్చుకెళ్లిన వైనం
● రంగంలోకి దిగిన పోలీసులు
పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి చేతులు కట్టి ద్విచక్ర వాహనంతో ఈడ్చుకెళ్లిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ ఏఆర్ దామోదర్ భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ మహేష్ నుంచి రామచంద్రపేటకు చెందిన ఏల్లా రాజేష్ 10 వేల రూపాయలకు బైక్ కొనుగోలు చేశాడు. ట్రయల్‌కు వెళ్తూ భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కారును ఢీ కొట్టాడు. దీంతో భోగాపురం పెద్దవీధికి చెందిన బైక్ మెకానిక్ లెంక శ్రీరామ్, బైక్ అమ్మకం చేసిన మహేష్ తరఫున మధ్యవర్తిగా వ్యవహరించి ఆరు వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చాడు. అయితే ప్రమాదం చేసిన బాధితుడు రాజేష్ డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో శ్రీరామ్ హెడ్ కానిస్టేబుల్‌కు రూ.6 వేలు చెల్లించి బైక్ తీసుకెళ్లాడు. ఇదంతా జరిగి నెల రోజులైంది. ఈ క్రమంలో ఈ నెల ఐదో తేదీన భోగాపురంలో రాజేష్‌ను మహేష్, తదితరులు అటకాయించి షెడ్‌లో బంధించారు. రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను ఇవ్వలేకపోవడంతో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో బాధితుడు రాజేష్ మెడకు, చేతులకు తాళ్లు కట్టి బైక్‌పై ఈడ్చుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులు లెంక శ్రీరామ్, మహేష్, సూర్యనారాయణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాధితుడ్ని రక్షించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


