పార్వతీపురం రూరల్: రైలెక్కి గమ్యం చేరాల్సిన ప్రయాణికులు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతోంది. స్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్స్ రైళ్ల కింద నుంచే.. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాగన్ల చక్రాల సందుల్లోంచి అత్యంత ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఒక పక్క ఏ క్షణాన కదులుతుందో తెలియని మృత్యుశకటం లాంటి గూడ్స్ రైలు.. మరో పక్క తమ రైలు అందుకోవాలనే ఆరాటం.. ఈ క్రమంలో పసిపిల్లల చేతులు పట్టుకుని, లగేజీలతో రైలు కింద నుంచి దూరుతూ ప్రయాణికులు చేస్తున్న ఈ సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ఆస్కారం ఉందని అక్కడి దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.


