గుమ్మలక్ష్మీపురం: అండర్ – 10 చైల్డ్ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిమ్మల దేశిక్‌రామ్ (జొల్లగూడ గ్రామం) ఎంపికై నట్లు కోచ్ పత్తిక బాలరాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ నెల 4న విజయనగరంలోని కస్పా హైస్కూల్‌లో జరిగిన అండర్ – 10, అండర్ – 12 విభాగం ఫెన్సింగ్ ఇంటివిడ్యువల్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి సెలక్షన్ ట్రయల్స్ ఫెన్సింగ్ క్రీడా పోటీలలో దేశిక్ రామ్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడన్నారు. అలాగే ఈ నెల 5, 6వ తేదీల్లో విజయవాడలోని శ్రీ అలపతి రామారావు, అనుమోలు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్‌లో(హనుమాన్‌పేట) జరిగిన 7వ ఏపీ స్టేట్ చైల్డ్ (అండర్–10) ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో దేశిక్ రామ్ బంగారు పతకం కై వశం చేసుకుని, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ నెలలోనే జమ్ముకశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో దేశిక్‌రామ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థినిని పలువురు అభినందించారు.


