విజయనగరం అర్బన్:
భావి తరాలను తీర్చిదిద్దడంతో పాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ సాధికారిక శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే ఉపాధ్యాయులకు నిజమైన గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభ, ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగు తల్లి, మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి, మానవ వనరుల వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. విద్యావంతుల కృషితో దేశం హరిత, శ్వేత, సమాచార సాంకేతిక విప్లవాలను సాధించి ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చాటించదన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, భావి సమాజాన్ని నిర్మించే మహత్తర బాధ్యత అని అన్నారు.
90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 90 మందిని మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యా రంగానికి వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారని వారు కొని యాడారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి దిశానిర్దేశం చేయాలి: మంత్రి కొండపల్లి
జిల్లా విద్యా ప్రగతిలో ఉపాధ్యాయుల
పాత్ర కీలకం : కలెక్టర్
90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు
ఘన సత్కారం
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి, గురువు–శిష్య సంబంధం, విద్యా ప్రాముఖ్యతను ప్రతిభింబించే గీతాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీఈఓ యు.మాణిక్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


