● నిర్దేశిత లక్ష్యాలు చేరాల్సిందే : కలెక్టర్
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని వృద్ధిపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. తన చాంబర్‌లో రిజిస్ట్రేషన్, రవాణా, గనులు భూగర్భ ఖనిజ శాఖ, ఎకై ్సజ్, అటవీ, వాణిజ్య పన్నులు తదితర ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ప్రగతిని సమీక్షించిన కలెక్టర్, అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కొన్ని శాఖల ద్వారా ఆదాయం తగ్గడానికి గల కారణాలను ఆరా తీశారు. ప్రతి శాఖకు ఇచ్చిన ఆదాయ లక్ష్యాన్ని అధిగమించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా తమ లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ అపర్ణ, డీఎఫ్‌ఓ సోమసుందర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు, సీనియర్ ఎంవీఐ దుర్గాప్రసాదరావు, సబ్ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు.
● అన్ని శాఖలకూ ఏ+ లక్ష్యం
ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల్లో(కేపీఐ) అన్ని శాఖలు ఏ+ గ్రేడ్ సాధించేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ఆన్‌లైన్ ద్వారా కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనితీరును పరిశీలించిన కలెక్టర్.. నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరేందుకు కేపీఐలు కీలకమని పేర్కొన్నారు. త్రైమాసిక నివేదికల్లోని 54 శాఖలు, అర్ధసంవత్సర నివేదికల్లోని 62 శాఖల పనితీరును సమీక్షించారు. బీ, సీ గ్రేడ్‌లలో ఉన్న శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. బీ, సీ గ్రేడ్‌లతో పాటు ఏ గ్రేడ్‌లో ఉన్న శాఖలు కూడా ఏ+ సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ పి.బాలాజీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


