కొత్తవలస: వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న మండల కేంద్రం కుమ్మరవీధికి చెందిన గంగవరపు కేశవను సీఐ టి.వి.విజయకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం స్థానిక కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..గతేడాది డిసెంబర్‌లో మంగళపాలెంలో గల శివాలయంలో.. ఈ ఏడాదిలో విశాఖపట్నం రోడ్డులో గల దుర్గాదేవి గుడిలోను.. అలాగే కుమ్మరి బంజిరీ కాలనీలో గల ఒక ఇంట్లో జరిగిన దొంగతనాల్లో కేశవ నిందితుడని చెప్పారు. అప్పటినుంచి ఆయన పరారీలో ఉండగా.. కొత్తవలస రైల్వేస్టేషన్ వద్ద అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై జోగారావు పాల్గొన్నారు.


