● పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ
ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్
● 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
సీతంపేట: విద్యార్థుల భవిష్యత్‌ను చదువు ద్వారా తీర్చిదిద్ది, వారి జీవితాల్లో మార్పు తీసుకురాగలిగేది ఉపాధ్యాయులేనని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ, వారిలో మంచి విలువలు, క్రమశిక్షణా జ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఐటీడీఏ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ప్రస్తుతకాలంలో సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను ఉపాధ్యాయులు నిరంతరం అవగాహన చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన బోధనా పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించాలని తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఏపీఓ జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, ఏఓ సునీల్, జీసీడీఓ రాములమ్మ, సీఎంఓ చిరంజీవులు, ఏటీడబ్ల్యూఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


