బొబ్బిలి: పట్టణంలోని యాదవవీధి కూడలిలో కొలువై ఉన్న బాల ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. ప్రహారీ ఉన్న బాల ఏసు మందిరలోకి చొరబడి విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమై పికెట్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి సమీప వీధుల్లో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. సీఐ కె. నారాయణరావు, ఎస్సై డి. కొండలరావు సంఘటనపై స్థానికులతో మాట్లాడుతూ.. వివరాలు తెలుసుకుంటున్నారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇటువంటి చర్యలు దుండగులు పాల్పడుతన్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ అధ్యక్షుడు మునకాల శ్రీనివాస్ అన్నారు. మత విద్రోహ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బొబ్బిలి క్రైస్తవ సంఘాల సమాఖ్య ఐక్యవేదిక నాయకుడు కురమాన జోగారావు డిమాండ్ చేశారు.


