అన్నదాతల ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆక్రందన

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

అన్నదాతల ఆక్రందన

ట్రెంచ్‌కటింగ్‌ పనుల పేరుతో వరి పంట విధ్వంసం

చెరువుల ఆక్రమణల తొలగింపు పేరిట భూముల్లో ట్రెంచ్‌కటింగ్‌

పంటసాగు మధ్యలో ఉందని

ప్రాధేయపడిన అన్నదాతలు

పనులు అడ్డుకుంటే జైలుకేనని

హెచ్చరించిన అధికారులు

సాలూరు: మండలంలోని పారన్నవలస, శివరాంపురం గ్రామాల్లో చెరువులను ఆనుకుని వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల ఆక్రందనను అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని పారన్నవలస, శివరాంపురం గ్రామాల్లో చెరువుల పక్కన వరి పంట సాగుచేస్తున్న అన్నదాతలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాదికూడా చెరువు పరిసర ప్రాంతాల్లో వరి నాట్లు వేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగి మరో రెండు నెలల్లో చేతికి అంది వచ్చే దశలో ఉంది.ఇటువంటి సమయంలో చెరువుల ఆక్రమణల తొలగింపు పేరుతో వీబీజీరాంజీ అధికారులు పంట సాగవుతున్న ప్రాంతంలోనే ట్రెంచ్‌కటింగ్‌ పనులు చేపట్టారు.

వరి పంటను నాశనం చేసి చంపేస్తారా?

చెరువుల ఆక్రమణల తొలగింపునకు తాము అడ్డేమీ కాదని రైతులు స్పష్టంచేస్తున్నారు. ఈ విషయం సాగు ముందే చెప్పి ఉండి ఉంటే తాము ఇన్ని వేల రుపాయలు పెట్టుబడి పెట్టి చెమటోడ్చి పంట సాగుచేసే వారిమి కాదని రైతులు వాపోతున్నారు. ఈ ట్రెంచ్‌కటింగ్‌ పనులు గ్రామాల్లోని మిగిలిన చెరువుల్లో చుట్టూ పంటలు లేని నేపథ్యంలో అక్కడ పూర్తిచేసి, చివరిగా ఇక్కడికి వస్తే ఈ లోపు పంట చేతికి వస్తుందని తరువాత అధికారులు నిబంధనల మేరకు చెరువుల ఆక్రమణల తొలగింపు చేసుకోవాలని విన్నవించుకుంటున్నారు.పంటసాగు మధ్యలో పంటను విధ్వంసం చేయవద్దని అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ పనులు అడ్డుకుంటే బెయిల్‌ కూడా లేకుండా జైల్లో పెడతామని అధికారులు బెదిరించారని రైతులు వాపోయారు.

44 చెరువుల్లో పనులు చేపట్టాం

చెరువుల ఆక్రమణల తొలగింపులో భాగంగా, మండలంలో 240 చెరువులుండగా, 44 చెరువుల్లో రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసి పూర్తిచేసి వీబీజీరాంజీ పనుల నిమిత్తం ఇచ్చాం. ఆ చెరువుల్లో పనులు చేపట్టాం. సుమారు 25 చెరువుల్లో పనులు పూర్తికావస్తున్నాయి. పనులను అడ్డుకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం.

కృష్ణారావు, వీబీజీరాంజీ ఏపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement