రైళ్లలో ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో ఆకస్మిక తనిఖీలు

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

రైళ్లలో ఆకస్మిక తనిఖీలు

ఠివిజయనగర టౌన్‌: రైళ్లలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ఒడిశా నుంచి విశాఖ వరకూ వచ్చే రైలు నంబర్‌ 58503 ప్యాసింజర్‌ ట్రైన్‌లో రైల్వే లోకల్‌ పోలీస్‌, ఈగల్‌, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ శుక్రవారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి ప్రధానంగా ఒడిశా రాష్ట్రం నుంచి రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతోందనే సమాచారంతో ప్రత్యేకంగా రైళ్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టామన్నారు. ప్రత్యేక బృందం గజపతినగరం రైల్వేస్టేషన్‌లో ఎక్కి విజయనగరం వరకూ ప్రయాణించి బృందాలుగా ఏర్పడి అన్ని బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారన్నారు. తనిఖీల్లో పాల్గొన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరుపై గజపతినగరం సీఐ ఎస్‌.సన్యాసినాయుడు ముందుగా వివరించి, వారు నిర్వర్తించే విధులు గురించి దిశానిర్దేశం చేశారన్నారు. రైళ్లలో అన్ని బోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి బ్యాగ్‌లను, లగేజీ, సూట్‌కేసులను పరిశీలించామన్నారు. అయితే ఎటువంటి నిషేధిత పదార్థాలు లభించలేదన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972 లేదా డయల్‌ 112 లేక 100కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ప్రజలను ఎస్పీ కోరారు. తనిఖీల్లో గజపతినగరం సీఐ ఎస్‌.సన్యాసినాయుడు, ఎస్సై కిరణ్‌కుమార్‌, ఆండ్ర ఎస్సై సీతారామ్‌, బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి, జీఈర్పీ, ఈగల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement