బొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామంలో గత నెల 31 రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి భర్త బుంగ రామముత్యాలు భార్యను హతమార్చినట్టు తేలిందని గజపతినగరం సీఐ సామంతుల సన్యాసినాయుడు తెలిపారు. దీనికి సంబంధించి బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామముత్యాలు అదే గ్రామానికి చెందిన బుంగ సంధ్యను ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి బాబు, పాప ఉన్నారు. కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య సఖ్యత దెబ్బతిని తగాదాలు జరుగుతున్నాయి. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చే రామముత్యాలు భార్య సంధ్యను డబ్బుల కోసం వేధించడంతో పాటు అత్తమామలను కూడా వేధించేవాడు. ఈ క్రమంలో గత నెల 31 రాత్రి పది గంటల సమయంలో ఇంటికి మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో భార్య సంధ్యను రామముత్యాలు ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేసి గోడకు బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిపోయి పడిన సంధ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు సీఐ తెలిపారు. మృతురాలి తల్లి ఈశ్వరమ్మ తన కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన అల్లుడే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో సంధ్య తలను బలంగా గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి మృతి చెందినట్టు నివేదిక వచ్చినట్టు తెలిపారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. నిందితుడు రామముత్యాలు హత్య చేసిన తరువాత పరారీ కాగా పోలీసులు నిఘా పెట్టి ఈ నెల 2వ తేదీ బుధవారం బొండపల్లి సమీపంలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.
వివరాలు వెల్లడించిన సీఐ


