● జిల్లా పంచాయతీ అధికారి హామీతో..
● ఆందోళన విరమించిన పంచాయతీ
కార్మికులు
విజయనగరం గంటస్తంభం: పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన 36 గంటల నిరసనలో భాగంగా గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.21వేల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, హెల్త్ అలవెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి బయటకు వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. బకాయి వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని, వాహనాల మరమ్మతులు, పనిముట్లు, రక్షణ పరికరాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పది రోజుల్లో ఎంపీడీవోలు, యూనియన్ పత్రినిధులతో సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాల పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. హామీలు అమలు కాకపోతే మళ్లీ పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.


