సెప్టెంబర్‌ 5లోపు పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 5లోపు పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలి

Sep 4 2026 2:00 AM | Updated on Sep 4 2026 2:00 AM

పెండింగ్‌ డీఏలు, బకాయిలు విడుదల చేయాలి

ఏపీజేఏసీ జిల్లా సమావేశంలో డిమాండ్‌

విజయనగరం గంటస్తంభం: ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏపీ జేఏసీ విజయనగరం జిల్లా కార్యవర్గం డిమాండ్‌ చేసింది. పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, సరెండర్‌ లీవ్‌లు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు బుధవారం ఏపీఎన్‌జీజీఓ హోంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ ఎ.సురేష్‌ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పీఆర్‌సీ కమిటీకి చైర్మన్‌ను నియమించి వెంటనే ఐఆర్‌ మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం కొన్ని సమస్యలను పరిష్కరించినందున ఇప్పటివరకు వేచిచూసే ధోరణితో ఉన్నామని, అయితే, ఉద్యోగుల్లో సంయమనం పాటించే ఓపిక కూడా నశిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను బాధ్యతగా అమలు చేయాలని, చర్చల ద్వారా మిగిలిన సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. సెప్టెంబర్‌ 5వ తేదీలోపు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గాలను ప్రభుత్వం ప్రకటించాలని, లేనిపక్షంలో రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా అన్ని తాలూకాల జేఏసీ నాయకులు సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయిలో పెద్ద వ్యవస్థ కావడంతో రాష్ట్ర నాయకత్వం అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్‌ ఎన్‌.వి.పైడిరాజు, కో–చైర్మన్‌ టి.శ్రీధర్‌బాబు, కోశాధికారి కె.చంద్రశేఖర్‌తో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పత్రినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement