ఆందోళనలో గురువులు
● పాఠశాలల్లో ఆయాలకు, వాచ్‌మెన్‌లకు నెలలుగా అందని జీతాలు
విజయనగరం అర్బన్:
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా... ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చలేదు. మోగా డీఎస్సీ నోటిఫికేషన్ల అక్రమాలపై సమగ్ర విచారణ లేదు.. విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయ డం లేదు.. వసతిగృహాల విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు.. పార్వతీపురం మన్యం జిల్లా లో గిరిజన విద్యార్థుల మృతిచెందినా కనీసం పరిహారం ప్రకటించలేదు... తరచూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టించుకోవడంపై నిరసన వ్యక్తంచేస్తూ.. విజయనగరం జిల్లాకు తొలిసారిగా శనివారం వస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వద్ద సమస్యలపై తాడోపేడో తేల్చుకునేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి మోసం చేసిన తీరుపై నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు. మంత్రికి జిల్లాలో నిరసన సెగ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నెరవేర్చని హామీలు..
ఎన్నికల హామీల్లో ప్రధానంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి నేటికీ అమలకు నోచుకోలేదు. వేలాది మంది నిరుద్యోగ యువతి ప్రతినెలా ఆశగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై విద్యార్ధి, నిరుద్యోగ సంఘాల పోరాడుతున్నా అధికారులు కాలయాపన, దాటివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. సరైన ఉద్యోగ క్యాలెండర్ లేక లక్షలాది మంది అభ్యర్థులు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఉపాధ్యాయులకు బోధన కన్నా యాప్‌ల అప్‌డేట్, ముఖ గుర్తింపు నమోదు పనులే ఎక్కువయ్యాయనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు న్నా విద్యాశాఖ మంత్రి పట్టించుకోవడం లేదు. టెట్ నుంచి మినహాయింపుపై స్పందన లేదు. మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 10వేలతో నోటిఫికేషన్ వేయాలంటూ నిరుద్యోగులు ధర్నాలు చేస్తు న్నారు. వీరుకూడా లోకేశ్ ఎదుట నిరసన తెలిపేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
రాజకీయ ఆర్భాటాలే తప్ప...
పరిష్కారాలు శూన్యం...
సమ్యల ఊబిలో కూరుకుపోయిన విద్యారంగాన్ని దారిలో పెట్టాల్సింది పోయి, ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యమిస్తున్నారని నిరుద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా తమ నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మంత్రి వస్తున్నారని ముస్తాబు
ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవసరాల కంటే విద్యాశాఖ పర్యటనే ప్రధానంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ, మౌలిక సదుపాయాలు పెంచాలనే లక్ష్యంతో ‘మన బడి–నాడు నేడు’ ఫేజ్–2 కింద 2022లో 15 అదనపు తరగతి గదులను మంజూరు చేశారు. దీనికి రూ.1.75 కోట్లు అంచనా వ్యయం కాగా, గత ప్రభుత్వంలో రూ.95 లక్షలు వెచ్చించి పనులను వేగవంతం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభు త్వం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కక్ష పూరిత ఆలోచనతో గత రెండేళ్లుగా నిధులు విడుదల చేయకుండా పనులను పక్కన పడేసింది. దీంతో 15 తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి.
మంత్రి వస్తుండడంతో ఎదురుగా కనిపించే 10 తరగతి గదులను హడావిడిగా ముస్తాబు చేస్తుండడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ముక్కునవేలేసుకుంటున్నారు. రెండేళ్లుగా పట్టించుకోని ఫినిషింగ్ పనులకు రాత్రికి రాత్రే నిధులు కేటాయించి రెండు రోజుల్లో తుది మెరుగులు దిద్దుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. మిగిలిన ఐదు గదులు సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు.
‘చెప్పు’ కోలేని వేదన...
ఈ చిత్రంలో కనిపిస్తున్నది బాబామెట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాలికలు. వీరికి అందజేసిన షూస్ నాణ్యతలేక నెలరోజలకే పాడయ్యాయి. దీంతో చెప్పులతోనే స్కూల్‌కు హాజరవుతున్నారు. ఇదే పాఠశాలలో శనివారం జరిగే క్లస్టర్ స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేశ్ వస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఉపాధ్యాయుల తలలపట్టుకుంటున్నారు. ష్యూస్ నాణ్యతలేవని చెప్పేధైర్యం లేక మనోవేదన చెందుతున్నారు. మరోవైపు చిరిగిన స్కూల్ బ్యాగులతోనే చాలా మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. ఇవి.. మంత్రి కళ్లకు కట్టే అవకాశం ఉందని, వాటిని చూసైనా నాణ్యమైన కిట్లు అందజేస్తే మంచిదన్న వాదన సైతం వినిపిస్తోంది.
రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యావ్యస్థ అస్తవ్యస్తంగా తయారైందని పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కల్పన, స్వచ్ఛ కార్యక్రమాల అమలు, అవసరమైన సామగ్రి కొనుగోలు నిమిత్తం పాఠశాల స్థాయిని బట్టి ప్రభుత్వం స్కూల్ వార్షిక గ్రాంట్ విడుదల చేసి హెచ్‌ఎంల ఖాతాలకు జమచేయాలి. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం పైసా నిధులు విడుదల చేయలేదు. సుమారు రూ.2కోట్లు నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాలల నిర్వహణకు చేతిచమురు వదులుతోందని హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణ కోసం పాఠశాలలకు నిధులు విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయలోకం గుర్రుగా ఉంది. ఈ అంశాన్ని లోకేశ్ వద్ద ప్రస్తావించేందుకు పలువురు సంఘనాయకులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ప్రభుత్వ పాఠశాలల్లోని పనిచేసే ఆయాలు, వాచ్‌మెన్‌ల వంటి చిరుద్యోగులకు ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లను న్నట్టు సమాచారం.
లోకేశ్ పర్యటన ఇలా..
విజయనగరం రూరల్: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. విజయనగరం దాసస్నపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ఉపాధ్యాయులతో నిర్వహించనున్న హెచ్‌ఆర్‌డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు విజయనగరం మండలం చెల్లూరు వద్ద నిర్వహించనున్న నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు.


