● విద్యలనగరంతో ఎనలేని అనుబంధం
● 2006లో మహాకవి గురజాడ విశిష్ట పురస్కారం
● 90 ఏళ్ల వయసులోనూ మహాకవి
ఆహ్వానపత్రం చూసి సాహితీవేత్తలతో ముచ్చట
విజయనగరం టౌన్:
తెలుగు సినీ చిత్రసీమలో అలనాటి అందాల నటి షావుకారు జానకి ఇకలేరన్న విషయం తెలుసుకున్న విజయనగర వాసులు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. విజయనగరంతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వంటి 400కి పైగా సినిమాల్లో నటించి అందరితోనూ శభాష్ అనిపించుకున్న నటి షావుకారు జానకి (94) మృతిచెందడం పట్ల జిల్లాకు చెందిన సాహితీవేత్తలు, సినీ, సంగీతాభిమానులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
మహాకవి గురజాడ విశిష్ట పురస్కారాన్ని 2006లో ఆమె విజయనగరంలో అందుకున్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆమెకు పురస్కారంతో పాటు స్వర్ణ అంగుళీకాన్ని బహూకరించారు. అయితే, తాను ఏదీ స్వీకరించడానికి ఇష్టపడనని, దానికి ప్రతిఫలంగా వెంటనే జీయర్ అంధుల పాఠశాలకు సభలోనే 25వేల రూపాయలు చెక్కును విరాళంగా అందజేసిన మానవతా మూర్తి షావుకారు జానకి అంటూ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఎ.గోపాలరావు తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రెండురోజుల పాటు విజయనగరంలో ఉన్న ఆమె తమ కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్ ఇలా అందరికీ బహుమతులుగా వెండి వస్తువులు, చీరలు, నగదు అందజేసి వెళ్లడం ఆమె సహృదయానికి నిదర్శనమన్నారు. ఇటీవల చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం అందజేసే సమయంలో ఆ సభ ఆహ్వానపత్రం చూసిన ఆమె చంద్రబోస్‌కి అభినందనలు తెలియజేయమని 90 ఏళ్ల వయసులో తెలియజేసినట్టు సమాఖ్య ప్రతినిధి కాపుగంటి ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. మానవతామూర్తి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సమాఖ్య ప్రతినిధులు తమ సంతాపాన్ని తెలిపారు.
2006లో మహాకవి గురజాడ విశిష్ట పురస్కారం


