చనమల్లుపేట గురువుకు జాతీయ కీర్తి | - | Sakshi
Sakshi News home page

చనమల్లుపేట గురువుకు జాతీయ కీర్తి

Aug 22 2026 1:53 AM | Updated on Aug 22 2026 1:53 AM

గ్రామీణ బడిలో వినూత్న బోధన..

జాతీయ పురస్కారానికి రాజేష్‌ ఎంపిక

పుస్తక రచయితగా, విద్యలో సాంకేతికతకు పెద్దపీట

ఉత్తమ గురువుగా రాణిస్తున్న కార్పెంటర్‌ కొడుకు

నెల్లిమర్ల రూరల్‌: సాంకేతికతను విద్యాబోధనలో మేళవించి, గ్రామీణ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు, తన ఆలోచనలను సామాజిక మాధ్యమాల ద్వారా లక్షలాది మంది ఉపాధ్యాయులకు చేరువ చేసిన ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. నెల్లిమర్ల మండలం చనమల్ల్లుపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆయనకు 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసినట్టు కేంద్ర విద్యాశాఖ, న్యూఢిల్లీ నుంచి ఈ మెయిల్‌లో శుక్రవారం సమాచారం అందింది.

ఏఐతో 2,200 పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాల సాధన...

విద్యాబోధనలో సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగించడమే తనకు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణమని రాజేష్‌ తెలిపారు. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌( ఏఐ) సహాయంతో 2,200 పాఠశాలల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్‌) లక్ష్యాలు సాధించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా వినూత్న బోధన పద్ధతులను రూపొందించి, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.

వాట్సాప్‌ ఆటోమేషన్‌తో 22వేల మందికి ప్రయోజనం...

విద్యార్థులు, ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్నానాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా వాట్సాప్‌ ఆటోమేషన్‌ విధానాన్ని వినియోగించినట్లు రాజేష్‌ తెలిపారు. దీనిద్వారా శిక్షణాభ్యసనకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా చేరవేస్తూ 22వేల మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల్లో సీట్లు సాధించేలా తోడ్పడినట్లు చెప్పారు.

25 లక్షల మంది ఉపాధ్యాయులకు చేరిన బోధన విధానాలు...

పాఠ్యపుస్తక రచయతగా, ఎన్‌సీఈఆర్‌టీ, సీఐఈటీ జాతీయ వనరుల వ్యక్తిగా రాజేష్‌ సేవలు అందిస్తున్నారు. ఆయన రూపొందించి వినూత్న బోధనా విధానాలు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులకు చేరువయ్యాయని ఆయన చెప్పారు. తన విద్యాపరమైన ఆవిష్కరణలను బ్రిటీష్‌ కౌన్సిల్‌, అమెరికన్‌ కౌన్సిల్‌తో పాటు భారత ప్రభుత్వానికి చెందిన ఎంహెచ్‌ఆర్‌డీ గుర్తించి ప్రచురించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విద్యారంగానికి తాను అందించిన సేవలే జాతీయ పురసారానికి ఎంపిక చేశాయని సంతోషం వ్యక్తంచేశారు.

కార్పెంటర్‌ కుమారుడిగా...

రాజేష్‌ స్వగ్రామం శృంగవరపుకోట మండలంలోని ధర్మవరం గ్రామం. తండ్రి శంకరరావు కార్పెంటర్‌గా పనిచేయగా తల్లి రమణమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా సేవలందిస్తున్నారు. ధర్మవరం ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో ఎంఏ చేశారు. ఆయన భార్య వసుంధర విజయనగరంలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రాజేష్‌ ప్రస్తుతం చనమల్ల్లుపేట పాఠశాలలో పనిచేస్తున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని, అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని రాజేష్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు అభినందనలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement