రేగిడి: ఇటు విజయనగరంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆధారమైన సంకిలిలోని ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం మూతపడుతోంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ చెరకు ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలుపుదలచేస్తున్నామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చావు కబురు చల్లగా చెప్పింది. ఈ మేరకు ఒక నోట్ విడుదలచేసి అందరినీ అయోమయానికి గురిచేపసింది. ఈ ఫ్యాక్టరీ మూతపడేదిశగా ఆలోచన చేస్తోందని ఓ వైపు రైతులు, మరో వైపు మీడియా, ఇంకో వైపు వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెట్టి కూటమి దృష్టికి తీసుకవెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం, క్రషింగ్‌కు సరిపడా చెరకు లేదనే నెపంతో 2027–28 ఆర్థిక సంవత్సరంలో(2027 ఏడాది డిసెంబర్ నుంచి మార్చి 2028 వరకూ) చెరకు క్రషింగ్ ఆపేస్తున్నామని, ఫ్యాక్టరీకి చెరకును పంపించే రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ ప్రకటనలో ఎల్‌నినో ప్రభావం కూడా ఉందని పేర్కొంది. అంటే 2027 నుంచి ఫ్యాక్టరీ మూసేస్తున్నట్లు స్పష్టంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది.
ఒక్క ఆధారం కూడా..
భీమసింగి, సీతానగరం చెరకు ఫ్యాక్టరీలు మూతపడిన తరువాత ఈ ఫ్యాక్టరీయే రైతులకు ఆధారంగా ఉండేది. వ్యవసాయ పెట్టుబడులు పెరగడం, చెరకు రవాణా ఖర్చులు అధికం కావడంతో పాటు గతంలో జామి, బొబ్బిలి, సీతానగరం వంటి ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే చెరకు ఇప్పుడు తగ్గిపోయింది. 1997లో రోజుకు కేవలం 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఇక్కడ సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పట్లో ఈఐడీ పార్టనర్‌తో రాజాంకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 2002 నాటికి క్రషింగ్ రోజుకు 3వేల టన్నులకు చేరింది. 2006లో 5 టన్నులకు చేరుకుంది. ఆరంభంలో 2 లక్షల టన్నులు చెరకును క్రషింగ్ చేసే ఈ ఫ్యాక్టరీ 2014– 15 ఏడాదిలో సీజన్‌లో 4.5 లక్షల టన్నుల క్రషింగ్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మళ్లీ 2 లక్షల టన్నుల క్రషింగ్‌కు దిగిపోయింది. 35 వేల ఎకరాల్లోని చెరకు పంటను క్రషింగ్ చేయడమే కాకుండా 12వేల మంది రైతులకు ఆర్థికంగా నిలబెట్టింది. 3 వేల మంది కార్మికులకు, ఉద్యోగులకు భవిష్యత్తును ఇచ్చింది. 30 ఏళ్ల ప్రయాణం అనంతరం ఫ్యాక్టరీ అలిసిపోయింది.
రోడ్డున పడుతున్న 3 వేల కుటుంబాలు
ఫ్యాక్టరీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను, చిరు ఉద్యోగులును గతేడాది నుంచి ఫ్యాక్టరీ తొలగిస్తోంది. కొంతమంది కార్మికులను, షిప్ట్ ఉద్యోగులను, ఏరియా సూపర్ వైజర్లను తొలగించారు. కొంతమందిని పొమ్మనలేక పొగబెట్టేవిధంగా జీతాలు నిలుపుదలచేయడం, కట్ చేయడం పాటిస్తోంది. ఈ ఫ్యాక్టరీ మూతపడితే 3 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిపొందుతున్న మరో పదివేల రైతువారీ, చిరువ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.
ముందే చెప్పిన సాక్షి..
ఒకప్పుడు మూడు సీజన్‌లు, ఆరు క్రషింగ్‌లుగా ఉండే సంకిలి సుగర్ ఫ్యాకర్టీ ఇప్పుడు నష్టాలు ఊబిలో చిక్కుకుందని, ఈ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆర్థిక చేయూతనిచ్చే పాలకులు కరువయ్యారని సాక్షి దినపత్రిక ముందే చెప్పింది. ఈ ఏడాది జూన్ 19న ఉన్న ఒక్కటీ మూసేద్దాం అనే శీర్షికతో కథనం ప్రచురించింది. కథనం వచ్చిన తరువాత కూడా అటు అధికారులు, ఇటు పాలకుల్లో చలనం కనిపించలేదు. పలుమార్లు స్థానిక ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు మీడియా సమావేశాలు, మండలి సమావేశాలల్లో ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో పాటు ఫ్యాక్టరీ మూతపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడలేదు. ఫలితంగా నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమని చెప్పి, మూసివేతకు యాజమాన్యం ముహూర్తం పెట్టేసింది.
సుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు ముహూర్తం
క్రషింగ్ ఆపేస్తున్నామంటూ ఈఐడీ ప్యారీ యాజమాన్యం
నోట్ విడుదల
ముందే చెప్పిన సాక్షి
వైఎస్‌ఆర్‌సీపీ గొంతువిప్పినా పట్టించుకోని కూటమి
లబోదిబోమంటున్న చెరకు రైతులు
రోడ్డున పడనున్న 3 వేలమంది ఉద్యోగులు


