రాజాం: పట్టణంలోని అప్సర థియేటర్ (ఎస్‌వీసీ) వద్ద శుక్రవారం మహేంద్రగిరి వారాహి టీం సందడి చేసింది. నటుడు సుమంత్, నటి మీనాక్షి గోస్వామితో పాటు సినిమా టీం థియేటర్ వద్దకు చేరుకుని ప్రేక్షకులను అలరించారు. థియేటర్ ఆవరణలో వారాహిమాత ప్రతిమకు పూజలు చేశారు.
షార్ట్‌ఫిల్మ్‌తో శక్తియాప్‌పై అవగాహన
విజయనగరం టౌన్: మహిళలు ఆపద సమయంలో పోలీసుల సహాయాన్ని సులభంగా పొందేందుకు రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేకంగా శక్తి (ఎస్‌ఓఎస్) యాప్‌ను రూపొందించింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టూటౌన్ పోలీసులు రూపొందించిన ‘సురక్షా సేతు’ షార్ట్ ఫిల్మ్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ యాప్‌ను తన మొబైల్‌లో తప్పనిసరిగా నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో యాప్‌లోని ఎస్‌ఓఎస్ బటన్ ప్రెస్‌చేసి సులభంగా రక్షణ పొందవచ్చన్నారు. టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ చూడడం వల్ల ఆపద సమయంలో అప్రమత్తం కావడంపై అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి.లీలారావు, తదితరులు పాల్గొన్నారు.
దారి చూపని నేతలు..!
● ఇంకెన్నాళ్లీ డోలీ మోతలు
కొమరాడ: పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ ఏజెన్సీలో గిరిజనుల బతుకులు మాత్రం గుంతలు దాటడం లేదు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రచార ఆర్భాటాలు మిన్నంటుతున్నాయి. క్షేత్ర స్థాయిలో గిరిజన పల్లెల కష్టాలు ఎక్కడ వేసిన గొంగిళి అక్కడే అన్న చందంగా ఉన్నా యి. ఈ నేపథ్యంలో కొమరాడ మండలం పాలెం పంచాయతీ కూస్తురు గ్రామంలో శుక్రవారం సంభవించిన ఓ హృదయ విచారక దృశ్యమే ఇందుకు సజీవ సాక్ష్యం. గ్రామానికి చెందిన తాడంగి సురేషన్ కడుపునొప్పితో పాటు కడుపు పొంగిపోవడంతో ఆనారోగ్యానికి గురయ్యాడు వెంటనే కుటుంబసభ్యులు సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీ కట్టి రాళ్లరహదారిపై నడుచుకుంటూ వచ్చి కొంత దూరంలో ఆటో ఎక్కి రాయిపురం గ్రామానికి వచ్చి అక్కడినుంచి నెల్లిమర్లలోని మిమ్స్ అస్పత్రికి వెళ్లడానికి రూ.ఐదు వేలకు బొలెరో వాహనం మాట్లాడుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అనుమతులు రాక వందలాది గిరిజన గ్రామాలు నేటికి కనీస రవాణా సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులులు కోరుకుంటన్నారు.


