కలెక్టరు సారూ.. ఇదేం తీరు! | - | Sakshi
Sakshi News home page

కలెక్టరు సారూ.. ఇదేం తీరు!

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

సాక్షి, పార్వతీపురం మన్యం:

‘కలెక్టరు గారూ.. మీ దగ్గర నుంచి సమాధానం ఆశించడం లేదు. ఐయామ్‌ ఎక్స్‌పెక్టింగ్‌ ఓన్లీ వర్క్‌ ఫ్రం యు సార్‌! ఇన్‌కేస్‌ నా వర్క్స్‌ కన్సిడర్‌ చేయకపోతే మీ మీద ప్రివిలైజ్‌ మోషన్‌ స్పీకర్‌కు ఇవ్వడానికి కూడా వెనుకాడను.’

‘కలెక్టర్‌ గారూ, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నన్ను వేరే విధంగా చూపించకండి. మీకు, నాకు పర్సనల్‌గా ఎటువంటి ఇష్యూలు లేవు. మీ చదువుకు, మీ ఉద్యోగాన్ని నేను గౌరవిస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను.. నాకు ఓటేసిన ప్రజల డెవలప్‌మెంట్‌ మాత్రమే ఆశిస్తున్నాను. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పాలి. ఎంపీగా నేను వారి కోసం ఏదైనా చేయాలి.’

అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గుమ్మ తనూజరాణి ఇటీవల జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి.

జెడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తీరును ఎత్తిచూపారు. తనకు ఓటేసిన ప్రజలకు సేవ చేసుకునే అవకాశానికి మోకాలడ్డుతున్నారని వాపోయారు. ఎంపీ ల్యాడ్స్‌ కింద కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా.. వాటితో అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓటేసిన ప్రజలకు అందరికీ తాను సమాధానం చెప్పుకోవాలని తెలిపారు. యువ ఎంపీ.. గిరిజన బిడ్డ.. ప్రజలకు సేవ చేయా లన్న ఆకాంక్షతో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టి, అనతికాలంలోనే ధీటైన నాయకురాలిగా ఎదిగిన అరకు పార్లమెంట్‌ సభ్యురాలు తనూజూరాణి చేసిన వ్యాఖ్యలు.. రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఆవేదన వెనుక అంతులేని ‘రాజకీయ వివక్ష’ ఉంది. అభివృద్ధి కంటే కక్షపూరిత రాజకీయమే ముఖ్యమనుకునే ప్రజాప్రతినిధుల అసూయ దాగి ఉంది. ఎమ్మెల్యే లు ఒక నియోజకవర్గానికే ప్రజాప్రతినిధి.. ఎంపీ ఏడు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. అధికార పార్టీలో ఎమ్మెల్యేకు ఇస్తున్న విలువ.. పార్లమెంట్‌ సభ్యురాలికి ఇవ్వకపోవడం.. జిల్లా యంత్రాంగం అందుకు వంతపాడటం బహుశా పార్వతీపురం మన్యం వంటి ప్రాంతంలోనే జరిగి ఉండొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు, మేధావులు పేర్కొంటున్నారు.

ఎవరు నిధులిచ్చినా.. ప్రజల కోసమే కదా!

గత ఎన్నికల్లో అరకు ఎంపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి ఘన విజయం సాధించారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. గిరిజన ప్రాంత సమస్యలపై పార్లమెంట్‌ సాక్షిగా గళం వినిపిస్తున్నారు. తన పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీ ల్యాడ్స్‌ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున నిధులు ఆమె అందజేస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి రూ.75 లక్షలు, పాలకొండకు రూ.75 లక్షలు, కురుపాం రూ.40 లక్షలు, సాలూరు నియోజకవర్గానికి రూ.30 లక్షలు చొప్పున 2024, సెప్టెంబర్‌ నుంచి ఇస్తున్నారు. సీసీ రహదారులు, కల్వర్టులు, తాగునీరు, వీధి దీపాలు, సోలార్‌ లైట్ల కోసం నిధులు వెచ్చించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. ఏఎస్‌ఆర్‌ జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ను చక్కగా వినియోగించుకుని వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి అందులో ఒక్క రూపాయి కూడా అధికార యంత్రాంగం ఖర్చు చేయకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అభివృద్ధి పనులకు మోకాలడ్డేదెవరు..?

ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో తాత్సారం ఎందుకు?

నిధులిస్తున్నా.. ఎమ్మెల్యేల అభ్యంతరం ఏమిటి?

జిల్లాను అభివృద్ధి చేయడం ఇష్టం లేదా?

కేవలం అధికారుల వల్లే ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని అరకు ఎంపీ ఆవేదన

ఆది నుంచి ఇదే తీరు...

ఎంపీ తనూజరాణి పట్ల జిల్లా అధికార యంత్రాంగం ఆది నుంచి నిర్లక్ష్యం, వివక్షనే చూపిస్తోంది. గిరిజన ప్రాంతమైన మన్యంలో.. ఒక గిరిజన ఎంపీపై ఇటువంటి బేధాలు చూపడం పట్ల పలుమార్లు సమావేశాల్లోనే ఆమె వాపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు, సమావేశాలకు, ప్రారంభోత్సవాలకు ఎంపీగా పిలుపు ఉండడం లేదు. ఆమె వచ్చిన సందర్భాల్లో ప్రొటోకాల్‌ విస్మరిస్తున్నారు. ఎంపీ అధ్యక్షతన జరగాల్సిన దిశ సమావేశాల్లోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో హాజరు కాని పరిస్థితి. ఎంపీ ల్యాడ్స్‌ వినియోగించకపోవడంపై గత దిశ సమావేశంలోనే అందరి ముందు ఆమె కలెక్టర్‌ దృష్టిలో పెట్టారు. సుమారు మూడు నెలలవుతోంది. ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. వారు అభ్యంతరం చెప్పడం వల్లే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వివక్ష కారణంగానే, ఓటేసిన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదనతో రెండు రోజుల కిందట జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌కు అంతా తెలిసే జరుగుతుందన్న అభిప్రాయం ఆమె మాటల్లో వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement