విజయనగరం అర్బన్: మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల హక్కులకోసం పోరాడని, ఆయన ఆశయాలు గొప్పవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ కూడలిలోని పూలే విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పూలే సేవలను కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు, ఓబీసీ రాష్ట్ర జనరల్ కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మి, గొలగాని రమేష్, బీటీప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
పూలే ఆశయాలు గొప్పవి
విజయనగరం రూరల్: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు ఎంతో గొప్పవని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలోని పూలే దంపతుల విగ్రహాలకు ఆయన శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి పూలే దంపతుల కృషి ఎనలేనిదన్నారు. బాలికుల, మహిళల అభ్యున్నతికి వారు చేసినకృషి వెలకట్టలేనిదన్నారు. వారి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ఎంపీపీలు పాల్గొన్నారు.
జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా నిర్మల
చీపురుపల్లి: రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో సివిల్, సీనియర్ డివిజనల్ జడ్జిలుగా పనిచేస్తున్న 15 మంది జిల్లా సెషన్స్ జడ్జిలుగా ఉద్యోగోన్నతి పొందారు. వారిలో చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన బంకపల్లి నిర్మల జిల్లా సెషన్స్ జడ్జిగా ఉద్యోగోన్నతి పొందారు. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం జిల్లా టెక్కలి కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. నిర్మల జిల్లా జడ్జిగా నియామకం కావడంపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


